జనసేన పార్టీలో సామాన్య కార్యకర్త, వీరమహిళ అయిన నులక గోవిందమ్మకు ప్రత్యేక గుర్తింపు లభించింది. వీర మహిళ నులక గోవిందమ్మను జనసేన పార్టీ ఘనంగా సత్కరించింది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు చేతులు మీదుగా నులక గోవిందమ్మను ప్రత్యేకంగా సత్కరించారు. గోవిందమ్మ చూపిన తెగువ.. వీరమహిళలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఈ సందర్భంగా నాగబాబు కొనియాడారు. గోవిందమ్మ లాంటి కార్యకర్తల తెగువ, కృషి కారణంగానే జనసేన వందశాతం స్ట్రైక్ రేట్ సాధించిందని చెప్పుకొచ్చారు. అయితే జనసేన పార్టీ నుంచి ప్రత్యేకంగా సత్కారం అందుకోవటంతో ఎవరీ గోవిందమ్మ అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
నులక గోవిందమ్మ.. ఈ పేరు జనసైనికులు, వీర మహిళల నోళ్లల్లో చాలాకాలం మారుమోగింది. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు ఈమె పేరు ప్రస్తావించారు. 2022 అక్టోబర్ 15న విశాఖపట్నం నోవాటెల్ హోటల్‌లో బసచేసిన పవన్ కళ్యాణ్‌ను.. అప్పటి వైసీపీ ప్రభుత్వం అడ్డుకునేందుకు యత్నించింది. నోవాటెల్ హోటల్ నుంచి బయటకు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో చాలామంది జనసైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు.. ఆయనకు మద్దతుగ విశాఖ బీచ్ వద్దకు చేరుకున్నారు. కొన్ని గంటలపాటు పవన్ కళ్యాణ్ కోసం విశాఖ సముద్ర తీరంలో నిరసనలకు దిగారు. ఈ క్రమంలోనే పలువురు జనసేన కార్యకర్తలను వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేయించింది.
అయితే అదే రోజు నులక గోవిందమ్మ పవన్ కళ్యాణ్ కోసం నిశ్శబ్ద దీక్షకు దిగారు. తన చంటి బిడ్డను ఒడిలో ఉంచుకొని జనసేన జెండా పట్టుకొని బీచ్‌లో కూర్చుని నిశ్శబ్దంగా నిరసన తెలిపారు. ఈ ఘటన అప్పట్లో జనసైనికులను కదిలించింది. అలాగే వారిలో స్ఫూర్తిని నింపింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో జనసేన గ్రాండ్ విక్టరీ కొట్టడంతో జనసేన పార్టీ నులక గోవిందమ్మను సత్కరించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు.. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి గోవిందమ్మ కుటుంబాన్ని పిలిపించి సత్కరించారు.గోవిందమ్మ చూపిన తెగువను నాగబాబు కొనియాడారు. గోవిందమ్మ ధైర్యం అనేక మంది వీర మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్న నాగబాబు. జనసేన పార్టీ విజయం కోసం పార్టీ బలోపేతం కోసం పని చేసే కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పారు.
![]() |
![]() |