ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకసారి గతాన్ని తలుచుకున్నారు. రాజధాని అమరావతిపై బుధవారం శ్వేతపత్రం విడుదల చేసిన ఆయన.. ఈ సందర్భంగా గతాన్ని గుర్తుచేసుకున్నారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఎదురైన ఘోర పరాజయాన్ని తలుచుకుని విచారం వ్యక్తం చేశారు. అప్పట్లో తన విజన్‌ను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పలేకపోయానని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పటికీ.. ఆ ప్రాంతంలోనూ టీడీపీకి ఓట్లు రాకపోవటంపైనా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. తానెప్పుడూ పాజిటివ్‌గానే ఆలోచిస్తానన్న చంద్రబాబు.. గతాన్ని తవ్వడం వలన ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ఏపీ అభివృద్ధి కోసం తాను చేసిన పనులను ప్రజలకు సరిగా వివరించలేకపోయానేమోనని అన్నారు. ఇక ఎన్నికల్లో ఓడి అధికారానికి దూరం కావటం వలన తానూ ఇబ్బందిపడ్డానని.. ప్రజలు సైతం ఇబ్బందులు వచ్చాయన్నారు.
మరోవైపు స్థిరమైన సిద్ధాంతం అంటూ తనకేమీ ఉండదని చంద్రబాబు చెప్పారు. ఎవరు ఏ ఆలోచన ఇచ్చినా.. అది సరిగా ఉంటే అమలుచేస్తామని.. మనకి ఆకాశమే హద్దంటూ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ విధానాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని.. సంపద సృష్టి జరగాలనేదే తన కోరిక అని చంద్రబాబు స్పష్టం చేశారు.అమరావతి గురించి మాట్లాడిన చంద్రబాబు.. ప్రపంచంలోనే అతిపెద్ద భూ సేకరణ ప్రాజెక్టు అని చెప్పారు. అమరావతి నిర్మాణంలో కొత్తగా ప్రణాళికలు ఏమీ లేవన్న ముఖ్యమంత్రి.. పాత వాటినే కొనసాగిస్తామని చెప్పారు.
అమరావతి నిర్మాణం కోసం దేశంలోని ప్రముఖ దేవాలయాల నుంచి పవిత్ర జలం, మట్టిని తెచ్చామన్న చంద్రబాబు.. ఏపీలోని ప్రతి గ్రామం నుంచి కూడా మట్టీ నీరు అందుకే అమరావతిని ఎవరూ కదిలించలేకపోయారని అన్నారు. ఆ మహిమ పవిత్ర జలానికి, మట్టికి ఉందని చెప్పుకొచ్చారు. వైసీపీ పాలనలో అమరావతిని నాశనం చేసి తెలుగుజాతికి ద్రోహం చేశారన్న ఏపీ సీఎం.. ఇలాంటి వ్యక్తులు రాజకీయాలలో పనికివస్తారా అంటూ ప్రశ్నించారు. అమరావతి విషయంలో ఏం జరిగినా వెనక్కి చూడనని స్పష్టం చేసిన చంద్రబాబు.. అమరావతి రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే అమరావతికి బ్రాండ్ ఇమేజ్ తీసుకువచ్చేందుకు ఏం చేయాలనే దానిపై ఆలోచిస్తున్నామని. ఈ శిథిలాల నుంచే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతామని ధీమా వ్యక్తం చేశారు.
![]() |
![]() |