టీడీపీ ఎమ్మె్ల్యే, తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావుపై కేసు నమోదైంది. మంగళవారం నాటి ఘటనకు సంబధించి వైసీపీ ఎంపీపీ నాగలక్ష్మి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు దౌర్జన్యంగా తన ఇల్లు ధ్వంసం చేశారని వైసీపీ ఎంపీపీ నాగలక్ష్మి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం నాటి ఘటనలో వీడియోల ఆధారంగా ఇప్పటివరకు 68 మందిని గుర్తించినట్లు సమాచారం.
అసలేం జరిగిందంటే..
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి అత్యుత్సాహం కారణంగా ఎన్టీఆర్ జిల్లా కంభంపాడులో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జాతీయ రహదారి మీద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కంభంపాడులో వైసీపీ ఎంపీపీ నాగలక్ష్మి భర్త చెన్నారావు తమ స్థలాలను ఆక్రమించి భవనం కడుతున్నారని కొంతమంది ముస్లిం మహిళలు కొలికపూడి దృష్టికి తీసుకవచ్చారు. దీంతో ఆదివారం అక్కడకు వచ్చి భవనాన్ని పరిశీలించిన కొలికపూడి.. ఆ భవనం అక్రమ నిర్మాణమని.. వాటిని తొలగిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.
ఇక మంగళవారం ఉదయం టీడీపీ, జనసేన కార్యకర్తలతో కలిసి మరోసారి అక్కడకు వెళ్లిన కొలికపూడి శ్రీనివాసరావు.. ప్రొక్లెయిన్ సాయంతో భవనాన్ని పాక్షికంగా కూల్చివేశారు. అయితే అప్పటికే వైసీపీ శ్రేణులు కూడా అక్కడకు చేరుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఆక్రమణలు తొలగించే వరకూ తాను అక్కడి నుంచి కదిలేది లేదంటూ కొలికపూడి శ్రీనివాసరావు భీష్మించుకుని కూర్చోవటంతో.. భద్రాచలం జాతీయ రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. విషయం తెలిసీ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఎమ్మెల్యేకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. అలాగే అధికారులు కూడా సర్దిచెప్పే ప్రయత్నం చేసినా కొలికపూడి వినలేదు. దీంతో రెండు గంటల పాటు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
అయితే చివరకు నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామంటూ అధికారులు తిరువూరు ఎమ్మెల్యేకు నచ్చజెప్పడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో రెండు గంటలపాటు జరిగిన హైడ్రామాకు తెరపడింది. అయితే టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే బలవంతంగా తమ ఇంటిని కూల్చివేశారంటూ వైసీపీ ఎంపీపీ నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదుచేయగా.. పోలీసులు తిరువూరు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.