తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య వేగవంతమైన ప్రయాణానికి అడుగులు పడుతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్ - నల్లపాడు రెండో రైల్వే లైను ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టు తొలి దశలో భాగంగా ఈ మార్గాల మధ్య రెండో రైల్వే లైన్ నిర్మాణం, విద్యుద్దీకరణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టు పనులు పూర్తి అయితే ఏపీ రాజధాని అమరావతి నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు కేవలం మూడు గంటల్లో చేరుకోవచ్చు.ఈ పనులు సకాలంలో పూర్తయ్యితే రెండు రాజధానుల మధ్య సులువుగా రాకపోకలు సాగించవచ్చని రైల్వే అధికారులు చెప్తున్నారు.
గుంటూరు జిల్లా నల్లపాడు.. బీబీనగర్ మధ్య 248 కిలోమీటర్ల రైల్వేలైన్ నిర్మాణానికి కేంద్రం గతంలో ఆమోదం తెలిపింది. ఈ రైల్వే లైన్ నిర్మాణం కోసం రూ.2,853 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించనుండగా.. మొత్తం నాలుగు దశల్లో ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా తొలి దశలో కుక్కడం నుంచి నడికుడి మార్గాల మధ్య తొలుత పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే కాంట్రాక్టర్‌ను ఎంపిక చేశారు. మొత్తం 47 కిలోమీటర్ల మేర పనులు జరగనుండగా.. ఇందుకోసం రూ. 570 కోట్లు ఖర్చుచేయనున్నారు.
ప్రాజెక్టు రెండో దశలో భాగంగా కుక్కడం నుంచి వలిగొండ వరకూ పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం టెండర్లు కూడా పిలవగా.. ఆగస్టు నెల నుంచి ఈ మార్గంలో పనులు ప్రారంభం కానున్నాయి. మరోవైపు నల్లపాడు-బీబీనగర్ రెండో రైల్వే లైను నిర్మాణానికి 200 హెక్టార్ల భూమి అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇందులో 135 హెక్టార్లు ఏపీలో, 65 హెక్టార్లు తెలంగాణ పరిధిలో ఉంది. ఈ మేరకు భూసేకరణ చేయాల్సి ఉంది. అయితే తొలుతగా భూ సేకరణ అవసరం లేని ప్రాంతాల్లో పనులు చేపడుతున్నారు.
బీబీనగర్- నల్లపాడు మధ్య ప్రస్తుతం ఒక రైల్వే లైన్ మాత్రమే ఉంది. సింగిల్ లైన్ కారణంగా ఒక రైలు కోసం మరో రైలును ఆపాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రెండో రైల్వే లైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు రాగా.. కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే సికింద్రాబాద్, అమరావతి మధ్య కేవలం మూడు గంటల్లోనే ప్రయాణించే వీలు కలుగుతుంది. ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.