ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే సామాజిక భద్రతా పింఛన్ల పెంపు నిర్ణయాన్ని అమలు చేసిన ఏపీ ప్రభుత్వం.. మరో హామీ అమలుకు సిద్ధమైంది. జులై 8వ తేదీ నుంచి ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి కొల్లు రవీంద్రను చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఆధ్వర్యంలో లోడింగ్, రవాణా ఛార్జీలు నిర్ణయించనున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఏపీలో ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం సమయంలో ఉచిత ఇసుక విధానం తెస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆ హామీ మేరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నెలరోజులలోపే నూతన ఇసుక పాలసీని తీసుకువస్తున్నారు.
నూతన ఇసుక విధానం మీద సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో.. 2014 నుంచి 2019 వరకు ఇసుక సరఫరాలో అమలు చేసిన విధానాన్ని చర్చించారు. 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలపైనా అధికారులతో చర్చించారు. వైసీపీ విధానాలతో ఏపీలో ఇసుక కొరత, ధరల భారం పెరిగిందన్న చంద్రబాబు నాయుడు.. నిర్మాణ రంగంలో సంక్షోభం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ప్రైవేట్ వ్యక్తులకు, ఏజెన్సీలకు ఇసుక క్వారీలను అప్పగించిన కారణంగా ఇసుక సరఫరా, అమ్మకాల్లో ఇబ్బందులు వచ్చాయని అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు.
అలాగే ఇసుక క్వారీల నిర్వహణలో లోపాలు, సీసీ కెమెరాలు, జీపీఎస్ ట్రాకింగ్, ఆన్ లైన్ విధానం సరిగా లేకపోవడం వలన అక్రమాలు జరిగిన సంగతిని సీఎంకు వివరించారు. ఈ నేపథ్యంలోనే వీలైనంత త్వరగా ఏపీలో నూతన ఇసుక విధానం తీసుకురావాలని అధికారులను ఆదేశించిన చంద్రబాబు.. నిర్మాణ రంగానికి కొరత లేకుండా ఇసుకను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అలాగే స్టాక్ పాయింట్లలో ఉన్న ఇసుకను సరఫరా చేసే అవకాశాలను పరిశీలించాలని మంగళవారం నాటి సమీక్షలో అధికారులకు స్పష్టం చేశారు. తాజాగా జులై ఎనిమిదో తేదీ నుంచే ఏపీలో ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించాలంటూ చంద్రబాబు స్పష్టం చేశారు. ఏర్పాట్లు చేయాల్సిందిగా మంత్రి కొల్లు రవీంద్రను ఆదేశించారు.
![]() |
![]() |