ఉత్తర దినాజ్‌పూర్‌లోని చోప్రాలో అక్రమ సంబంధం పెట్టుకున్నారంటూ ఓ జంటపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటనలో మరో వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అమిరుల్ ఇస్లాం అలియాస్ బదువాను ఈ రోజు ఉదయం బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఇస్లాంపూర్ పోలీస్ స్టేషన్ అధికారుల బృందం అరెస్ట్ చేసింది. అమిరుల్ ఇస్లాం స్వస్థలం చోప్రాలోని గిర్నర్ గ్రామం. అయితే చోప్రా ఘటనలో జంటపై స్థానిక టీఎంసీ నాయకుడు తాజ్ముల్ అలియాస్ జేసీబీ వెదురు కర్రతో దాడి చేశాడు. అదే సమయంలో అతడి పక్కనే అమిరుల్ ఇస్లామున్నాడని వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అదీకాక ఈ కేసులో అమిరుల్ మరో కీలక నిందితుడు. ఈ దాడి ఘటనకు సంబంధించిన వీడియోను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక సదరు జంటపై వెదురు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి తాజ్ముల్ను ఆదివారమే పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే తనపై దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో.. తన అనుమతి లేకుండా తీశారంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిని కఠినంగా శిక్షించాలని తన ఫిర్యాదులో పేర్కొంది.