జార్ఖాండ్ రాజకీయాల్లో బుధవారంనాడు అనూహ్య పరిణామాణాలు చోటుచేసుకున్నాయి. జార్ఖాండ్ ముఖ్యమంత్రి పదవికి చంపాయి సోరెన్ రాజీనామా చేసారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు పంపారు. దీంతో మాజీ సీఎం హేమంత్ సోరెన్ తిరిగి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమం అయింది. చంపాయి సోరెన్ రాజీనామా చేసిన కొద్ది సేపటికే హేమంత్ సోరెన్ జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్‌ను కలుసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ను ఆయన కోరారు. కాగా, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం చంపాయి సోరెన్ మీడియాతో మాట్లాడుతూ, కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి తాను బాధ్యతలు నిర్వహించానని చెప్పారు. హేమంత్ సోరెన్ తిరిగి రావడంతో కూటమి నేతగా హేమంత్ సోరెన్‌ను తామంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే తాను గవర్నర్‌కు రాజీనామా సమర్పించినట్టు చెప్పారు.