ముఖ్యమంత్రి చంద్రబాబు పాపాలు పండుతున్నాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో విధ్వంస రాజకీయాలకు పాల్పడుతూ విష సంస్కృతికి చంద్రబాబు బీజం వేస్తున్నారని, దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే రియాక్షన్ కూడా అదే స్థాయిలో ఉంటుందంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఆస్తులు ధ్వంసం చేస్తూ తిరిగి బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, ఇది ఏ మాత్రం న్యాయం కాదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో, మంచి పాలన అందించడంలో చంద్రబాబు దృష్టిపెడితే మంచిదన్నారు.