సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు ప్రమాదంలో చిక్కుకుంటే రక్షించేందుకు వీలుగా ‘ట్రాన్స్‌పాండర్లు’ (వైర్‌లెస్ కమ్యూనికేషన్‌కు సంబంధించిన పరికరం) ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద తీరప్రాంత రాష్ట్రాలకు 3.5 లక్షల పరికరాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇవి ఇస్రో టెక్నాలజీతో పనిచేస్తాయి. ‘ట్రాన్స్‌పాండర్’ అనేది వైర్‌లెస్ టెక్నాలజీతో రూపొందించిన పరికరం. రేడియో ఫ్రీక్వెన్సీతో పనిచేస్తుంది. దీని ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకోవచ్చు. మొబైల్ ఫోన్‌లో ఎలాగైతే టెక్ట్స్ మెసేజ్ చేసుకుంటారో ఇందులో కూడా అలా సమాచారం పంపుకోవచ్చు. సముద్రంలో ఎక్కడున్నా ఇది పనిచేస్తుంది. ట్రాన్స్‌పాండర్‌ని అమర్చేటపుడు దానిని సంబంధిత ఫిషింగ్ హార్బర్‌లోని మత్స్య శాఖ అధికారులతో లింకప్ చేస్తారు. ఆ బోటు సముద్రంలో ఎక్కడ తిరిగినా ఆ సమాచారం మత్స్య శాఖలో రిజిస్టర్ అవుతుంది. ఎంత దూరం వేటకు వెళ్లింది?, ఏ హార్బర్‌కు దగ్గరలో ఉంది?...అనే విషయాలు తెలుస్తాయి. అనుకోకుండా ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఆ సమాచారం బోటు నుంచి అందితే...వారు ఎక్కడున్నదీ అధికారులు సులభంగా గుర్తించగలుగుతారు. వెంటనే అక్కడకు కోస్టుగార్డును పంపించి రక్షిస్తారు. ట్రాన్స్‌పాండర్ బ్యాటరీతో పనిచేస్తుంది. బోటులో ఇంజిన్‌కి కనెక్ట్ చేస్తారు. ఇంజన్ రన్నింగ్‌లో ఉన్నంత సేపు ఇది ఆన్‌లోనే ఉంటుంది. మత్స్యకారులు ఒక్కోసారి ఇంజిన్ ఆపేసి సముద్రం మధ్యలో బోటును లంగరేసి వేట సాగిస్తారు. అటువంటి సమయాల్లో ఈ పరికరం పనిచేయడానికి బ్యాటరీ అవసరం అవుతుంది. అందుకని సోలార్ బ్యాటరీ ఏర్పాట్లు కూడా చేశారు. కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం ఖర్చు భరించి వీటిని ఏర్పాటుచేయనున్నాయి.