ప్రతిపక్షంలో ఉండగా కష్టనష్టాలకోర్చి.. పార్టీని విజయపథంలో నడిపిన పార్టీ నేతలు, శ్రేణులకు ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వాలన్న అంశంపై టీడీపీ అధినాయకత్వం కసరత్తు చేపట్టింది. గత ఐదేళ్లలో ఎవరు ఎలా పనిచేశారన్న అంశం ప్రాతిపదికగా వారందరికీ అంతర్గతంగా ర్యాంకులు ఇచ్చి తదనుగుణంగా నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో వివిధ శాఖలు, కార్పొరేషన్లల్లో ఉన్న నామినేటెడ్ పోస్టుల వివరాలను సోమవారం లోపు పంపించాలని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) సర్య్కులర్ కూడా జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం టీడీపీ కేంద్ర కార్యాలయంలోని వివిధ పార్టీ విభాగాల నేతలతో నాయకత్వం సమావేశం నిర్వహించింది. నామినేటెడ్ పదవుల భర్తీ, పార్టీకి– ప్రభుత్వానికి మధ్య సమన్వయం, పార్టీ కార్యక్రమాల నిర్వహణ వంటి అనేక అంశాలపై చర్చించారు. అధికారంలోకి వచ్చాక నాయకుల సిఫారసులతో అనేక మంది నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నిస్తుంటారని, అయితే వీరిలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగా పనిచేసిన వారికి ఎలా ప్రాధాన్యమివ్వాలో కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. గత ఐదేళ్లలో ఏ నియోజకవర్గంలో ఎవరు ఎలా పనిచేశారు.. ప్రభుత్వ ఒత్తిళ్లను తట్టుకుని పనిచేసిన వారెవరు.. దాడులకు గురైన వారెవరు అనేవి పరిగణనలోకి తీసుకుంటూ సమాచారం సేకరించాలని.. దాని ప్రాతిపదికగా వారికి ర్యాంకులు ఇవ్వాలని ప్రాథమికంగా నిశ్చయించారు. నామినేటెడ్ పదవులు లేదా పార్టీ పదవులు ఇచ్చే సమయంలో ఈ అంశాలకు ప్రాధాన్యమిచ్చి తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ దిశగా కసరత్తు చేయాలని సమావేశం నిర్ణయించింది.