ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లిన దొంగ.. ఊహించని పని చేసి బయటికి వచ్చాడు. దొంగతనానికి వెళ్లిన ఆ దొంగ.. ఇంట్లో ఉన్న డబ్బు.. బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేశాడు. ఆ తర్వాత తాను దొంగతనం చేయడానికి గల కారణాన్ని ఓ పేపర్‌పై రాసి పెట్టి వెళ్లిపోయాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుట్టుచప్పుడు కాకుండా దొంగతనం చేసి బయటపడ్డాడు. అయితే ఆ తర్వాత ఇంటికి వెళ్లి చూసిన యజమానికి తన ఇంట్లో దొంగతనం జరిగిందని అర్థం అయింది. అక్కడే ఒక లేఖ కనిపించగా.. దాన్ని చదివిన ఆ ఇంటి యజమానికి ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే ఆ లేఖ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి రకరకాల రియాక్షన్స్ వస్తున్నాయి. ఈ సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
తమిళనాడు తూత్తుకుడి జిల్లాలోని మేగ్నానపురంలో ఈ దొంగతనం జరిగింది. సాతాంకులం రోడ్డులో ఉన్న ఓ రిటైర్డ్ టీచర్ ఇంట్లో ఓ వ్యక్తి దొంగతనం చేశాడు. అయితే చిత్రాయ్ సెల్విన్ అనే రిటైర్డ్ టీచర్.. తన కుటుంబ సభ్యులతో కలిసి వేరే ఊరికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిత్రాయ్ సెల్విన్, ఆయన భార్య ఇద్దరూ రిటైర్డ్ టీచర్లు. అయితే వారికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. అయితే ఇటీవల వారి కుమారుడికి ఒక కుమార్తె పుట్టింది. ఆమెను చూసేందుకు గత నెల 17 వ తేదీన.. ఆ ఇద్దరు రిటైర్డ్ టీచర్స్ దంపతులు చెన్నైకి వెళ్లారు. అయితే వెళ్తూ వెళ్తూ.. ఇంటి తాళాలను పనిమనిషి సెల్వికి ఇచ్చి వెళ్లారు.
అయితే రోజూ లాగే ఆ రోజు కూడా సెల్వి.. ఆ ఇంటిని శుభ్రం చేసేందుకు వెళ్లి తాళం తీయగా.. దొంగతనం జరిగినట్లు తెలిసింది. తలుపులు పగలగొట్టి ఉండటం, ఇంట్లోని వస్తువులు అన్నీ చిందరవందరగా పడి ఉండటంతో దొంగలు దోచుకుపోయారని అర్థం అయి.. వెంటనే ఆ రిటైర్డ్ టీచర్స్ దంపతులకు సమాచారం అందించింది. వెంటనే వారు ఇంటికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు రంగంలోకి దిగి.. దొంగతనం జరిగిన ఆ ఇంట్లో ఆధారాల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే వారికి ఒక లెటర్ కనిపించింది. అది చదివి పోలీసులతోపాటు ఇంటి యజమాని కూడా అవాక్కయ్యాడు.
ఎందుకంటే ఆ ఇంట్లో దొంగతనం చేసిన దొంగ రాసిన లెటర్ అది. ఆ ఇంట్లో దొంగతనం చేసినందుకు తనను క్షమించాలని ఇంటి యజమానిని ఆ దొంగ వేడుకున్నాడు. అంతేకాకుండా తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని.. ఆమెకు చికిత్స అందించేందుకు తప్పని పరిస్థితుల్లో ఈ దొంగతనం చేసినట్లు చెప్పాడు. అంతేకాకుండా తాను ఎత్తుకెళ్లిన డబ్బును నెల రోజుల్లోగా తిరిగి ఇస్తానని రాసి పెట్టాడు. అయితే ఆ ఇంట్లో రూ.60 వేల నగదు, 12 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక జత వెండి పట్టీలు చోరీకి గురైనట్లు యజమాని సెల్విన్ గుర్తించారు.