పాము అంటేనే అంతా భయంతో వణికిపోతూ ఉంటారు. పామును చూస్తేనే ఆమడ దూరం పారిపోతాం. ఇక అదే పాము మనల్ని కరిస్తే.. భయంతోనే సగం చచ్చిపోతాం. అయితే ఓ పాము మాత్రం.. నిద్రపోతున్న ఓ వ్యక్తిని కరిచింది. ఇందులో విశేషం ఏముంది అంటారా. ఆ పాము వ్యక్తిని కరిచిన తర్వాత చనిపోయింది. గమ్మత్తుగా ఆ వ్యక్తి బతికి ఉండటం గమనార్హం. ఇది విని స్థానికులతోపాటు డాక్టర్లే ఆశ్చర్యపోయారు. ఈ ఘటన గురించి విన్నవారు.. పాము చనిపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే తనను పాము కరిచిన తర్వాత.. ఆ వ్యక్తి తిరిగి దాన్ని కొరికినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ సంఘటన బీహార్‌లో చోటు చేసుకుంది.
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సంతోష్ లోహర్ అనే కూలీ.. బీహార్‌లోని నవాడా జిల్లాలోని రాజోలు రైల్వే ప్రాజెక్టులో పనిచేయడానికి వెళ్లాడు. ఈ క్రమంలోనే జూలై 2 వ తేదీన రైల్వే క్యాంప్‌లో పడుకున్నాడు. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన ఓ పాము.. అతడ్ని రెండుసార్లు కాటు వేసింది. దీంతో ఉలిక్కిపడి సంతోష్ లోహర్ లేచి చూసేసరికి తన పక్కనే ఓ పాము కనిపించింది. భయపడకుండా వెంటనే ఆ పామును పట్టుకున్న సంతోష్ లోహర్.. తిరిగి దాన్ని రెండుసార్లు కొరికాడు. కొద్దిసేపటికి ఆ పాము చనిపోయింది. అనంతరం సంతోష్ లోహర్‌ను తోటి కూలీలు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందిన సంతోష్ లోహర్.. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి సురక్షితంగా ఉన్నాడు. అయితే అతడు కొరికిన పాము మాత్రం చనిపోవడం గమనార్హం. అయితే ఈ ఘటనపై ఒక్కొక్కరూ ఒక్కో రకమైన వాదనను వినిపిస్తున్నారు. పాము కరిచిన తర్వాత సరైన సమయంలో ఆస్పత్రికి రావడంతో.. చికిత్స చేసి అతడి ఒంట్లో నుంచి పాము విషాన్ని బయటికి తీసి ప్రాణాలు కాపాడినట్లు డాక్టర్లు చెబుతున్నారు. అయితే స్థానికుల వాదన మాత్రం మరో రకంగా ఉంది. తమ ప్రాంతంలో ఎవరినైనా పాము కాటు వేస్తే.. తిరిగి ఆ పామును కొరికితే.. పాము విషం మళ్లీ ఆ పాములోకే వెళ్లి అది చనిపోతుందని.. పాము కరిచిన వ్యక్తి ప్రాణాలతో ఉంటాడని పేర్కొంటున్నారు.
అయితే స్థానికులు చెబుతున్న విషయాలను మాత్రం డాక్టర్లు ఖండిస్తున్నారు. అది వారి మూఢ విశ్వాసమని కొట్టిపారేస్తున్నారు. పాము కాటు వేసిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తే బతుకుతారని చెబుతున్నారు. మూఢ విశ్వాసాలు నమ్మి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు.