త్రిపురలో హెచ్ఐవీ వైరస్ తీవ్ర కలకలం రేపుతోంది. ఇక ఎయిడ్స్ సోకి త్రిపురలో 47 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. నిత్యం 5 నుంచి 7 కొత్త ఎయిడ్స్ కేసులు నమోదవుతున్నట్లు అధికారులు వెల్లడించడం.. అక్కడ పరిస్థితికి అద్దం పడుతోంది. ఇక ప్రస్తుతం సుమారు 828 మంది విద్యార్థులు ఈ హెచ్ఐవీ ఎయిడ్స్‌తో బాధపడుతున్నట్లు త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీకి చెందిన ఓ సీనియర్ అధికారి ఈ వివరాలను వెల్లడించారు. ఇక హెచ్ఐవీ వైరస్ సోకిన 828 మంది విద్యార్థుల్లో 572 మంది ప్రాణాలతో ఉన్నట్లు చెప్పారు.
త్రిపుర రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 164 ఆరోగ్య కేంద్రాల నుంచి సమాచారాన్ని సేకరించి ఈ లెక్కలను విడుదల చేసినట్లు త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ - టీఎస్‌ఏసీఎస్ వెల్లడించింది. ఇక రోజుకు సగటున 5 నుంచి 7 మంది కొత్తగా వైరస్ బారిన పడుతున్నారని చెప్పారు. ఇక త్రిపుర రాష్ట్రం మొత్తం హెచ్ఐవీ సోకిన బాధితుల సంఖ్య 5674 గా ఉందని పేర్కొన్నారు. అందులో అత్యధికంగా పురుషులే ఉన్నట్లు తెలిపారు. పురుషులు 4,570 మంది.. మహిళలు 1103 మంది.. ఒకరు ట్రాన్స్‌జెండర్ ఉన్నట్లు వివరించారు.
అయితే త్రిపుర రాష్ట్ర వ్యాప్తంగా హెచ్ఐవీ కేసులు భారీగా పెరగడానికి గల కారణాన్ని త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లో డ్రగ్స్ వినియోగించడం వల్లే ఇలా విద్యార్థులంతా హెచ్ఐవీ బారిన పడుతున్నారని స్పష్టం చేసింది. త్రిపుర వ్యాప్తంగా ఉన్న 220 స్కూళ్లు, 24 కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులు ఇంజెక్షన్ల ద్వారా డ్రగ్స్‌ను తమ శరీరంలోకి ఎక్కించుకుంటున్నారని వెల్లడించింది. ఇలా ఒకరి నుంచి మరొకరికి హెచ్ఐవీ వైరస్ సోకుతోందని పేర్కొంది.
త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, త్రిపుర జర్నలిస్ట్ యూనియన్, వెబ్ మీడియా ఫోరమ్ వంటి సంస్థలు అన్నీ కలిపి ఇటీవల మీడియా వర్క్‌షాప్ నిర్వహించాయి. అందులో పాల్గొన్న టీఎస్‌ఏసీఎస్ జాయింట్ సెక్రటరీ.. ఇప్పటివరకు 828 మంది విద్యార్థులకు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా గుర్తించినట్లు చెప్పారు. వారిలో 572 మంది విద్యార్థులు బతికే ఉన్నారని.. ఎయిడ్స్ సోకి 47 మంది విద్యార్థులు చనిపోయినట్లు తెలిపారు. చాలా మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం త్రిపుర రాష్ట్రం దాటి.. బయటి రాష్ట్రాలు, దేశాలకు వెళ్లినట్లు చెప్పారు. ఇప్పటివరకు 220 పాఠశాలలు, 24 కళాశాలలు, పలు విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు గుర్తించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 164 ఆరోగ్య కేంద్రాల నుంచి ఈ డేటాను సేకరించినట్లు స్పష్టం చేశారు.