అన్నమయ్య జిల్లాలోని చిత్తూరు కర్నూలు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఐదుగురు ఫ్రెండ్స్ కలిసి కారులో వేగంగా వెళ్తుండగా.. ముందు వెళ్తున్న ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో స్పాట్‌లోనే నలుగురు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే రాత్రిపూట ఐదుగురు ఫ్రెండ్స్ కలిసి.. పాలకోవా తినేందుకు తమ గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లి తిని తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద స్థలాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి పరిశీలించారు.
వైఎస్ఆర్ జిల్లా కడప నగరానికి చెందిన ఐదుగురు స్నేహితులు శుక్రవారం రాత్రి కడపలో కలుసుకున్నారు. ఈ క్రమంలోనే పాలకోవా తినాలని వారు అర్ధరాత్రి పూట నిర్ణయించుకున్నారు. అనుకున్న వెంటనే శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటలకు అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలోని గువ్వలచెరువు గ్రామంలో పాలకోవా తినాలని కారులో బయల్దేరారు. వీరిలో పూజారి ఆంజనేయులు నాయక్(28), పఠాన్ అఫ్రోజ్ అలీఖాన్ (26), ఎం.జితేంద్రకుమార్(24), షేక్ అలీం(35), షేక్ ఖాదర్‌బాషా(19) కలిసి తమ కారులో వెళ్లారు.
అయితే ఆ ఆనందం వారికి ఎక్కువసేపు నిలవలేదు. పాలకోవా తిని శనివారం తెల్లవారుజామున రామాపురం నుంచి తిరిగి చిత్తూరు - కర్నూలు నేషనల్ హైవే మీదుగా కడపకు బయల్దేరారు. వారి కారు కొండవాండ్లపల్లి సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న ట్యాంకరును అతివేగంతో ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆంజనేయులు నాయక్, పఠాన్ అఫ్రోజ్ అలీఖాన్, జితేంద్రకుమార్, షేక్ అలీం ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇక మిగిలిన ఖాదర్‌బాషా తీవ్రంగా గాయపడగా.. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. అతడిని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఖాదర్ బాషా పరిస్థితి ప్రస్తుతం తీవ్ర విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘోర ప్రమాదంలో వారు ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జు అయింది. వెంటనే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన లక్కిరెడ్డిపల్లె పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. అసలు ప్రమాదానికి కారణం ఏంటి అని దర్యాప్తు చేస్తున్నట్లు లక్కిరెడ్డిపల్లె సీఐ జీవన గంగనాథబాబు తెలిపారు. ఇక ప్రమాద స్థలాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి పరిశీలించారు. ప్రమాదంలో చనిపోయిన యువకుల కుటుంబాలకు తక్షణ సాయం కింద మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన సొంత నిధుల నుంచి రూ.లక్ష అందించారు.