నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ పరీక్ష వ్యవహారంపై సోమవారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ ప్రశ్నాపత్నం లీక్ అయిన మాట వాస్తవమేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, ఇది 24 లక్షల మంది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశమని.. ‘నీట్ రీటెస్ట్’ను తాము చివరి అవకాశంగా పరిగణిస్తామని పేర్కొంది. నీట్ యూజీ పేపర్ లీక్ చేశారని, అవకతవకలు, అక్రమాలు జరిగాయని, పరీక్షను రద్దు చేయాలని కోరుతూ మొత్తం 38 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై త్రిసభ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ‘‘ నీట్ ప్రశ్నాపత్రం లీకైంది అన్న విషయం స్పష్టమైంది.. పరీక్ష సమగ్రతను దెబ్బతీశారని నిర్దారణ అయినా లేదా నేరం చేసిన వారిని గుర్తించలేకపోయినా మేం తిరిగి పరీక్ష నిర్వహణకు ఆదేశిస్తాం.. లీకైన పేపర్ సోషల్ మీడియాలో షేర్ చేశారని తెలిసినా మళ్లీ పరీక్ష నిర్వహించాలని చెబుతాం. కానీ, దీనికి ముందు.. లీకైన పేపర్ ఎంతమందికి చేరిందో తేలాల్సి ఉంది.. పరీక్ష రోజు ఉదయం పేపర్ లీక్ అయితే ప్రభావం విస్తృతంగా ఉండదు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ‘‘పేపర్ లీక్‌తో ఇద్దరు విద్యార్థులకే సంబంధం ఉందని చెబుతున్నారు... కానీ, అది 23 లక్షల మంది జీవితాలతో ముడిపడిన అంశం.. నిరుపేద కుటుంబాలకు చెందిన చాలా మంది అభ్యర్ధులు ఎంతో ఖర్చుచేసి పరీక్షకు హాజరయ్యారు.. కాబట్టి లీక్ ఎలా జరిగింది? అనేది తెలుసుకోవాలి.. లీక్ అయిన పేపర్ ఎంతమందికి చేరిందో గుర్తించారా? ఎలా చేరిందో తెలుసుకున్నారా? లీకేజీతో లబ్ధిపొందిన విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎంతమంది ఫలితాలను విత్ హోల్డ్‌లో ఉంచారు? వీటికీ సమాధానాలు కావాలి.. వీటన్నింటిపైనా సమగ్ర దర్యాప్తు జరగాలి’’ అని ఆదేశించిన ధర్మాసనం.. అన్నీ పరిశీలించిన తర్వాత తీర్పు వెలువరిస్తామని పేర్కొంది.
నీట్ వ్యవహారం పై దర్యాప్తు ఏ స్థితిలో ఉందో తమకు నివేదిక అందజేయాలని సీబీఐని ధర్మాసనం ఆదేశించింది. ప్రశ్నాపత్రం ప్రింటింగ్ విధానం, తొలిసారి ఎప్పుడు లీకైంది అనే విషయాన్ని బహిర్గతం చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సూచించింది. దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్షను మే 5న 4,750 కేంద్రాల్లో నిర్వహించగా.. 23 లక్షల మంది హాజరయ్యారు. అయితే, పేపర్ లీక్, పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ఏకంగా 67 మందికి మొదటి ర్యాంకు రావడంపైనా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇదే సమయంలో 1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాలతో 1563 మందికి మళ్లీ పరీక్షను నిర్వహించి, ఫలితాలను సవరించి ర్యాంకుల జాబితాను ఎన్‌టీఏ విడుదల చేసింది. నీట్ వివాదంపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని పార్లమెంట్‌లో నిలదీశాయి. ఇండియా కూటమి దీనిపై చర్చించాలని పట్టుబట్టింది. ఈ పరిణామాలతో కౌన్సెలింగ్‌ను కూడా కేంద్రం వాయిదా వేసింది.