ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు దృష్టి సారించారు. అందులోభాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు మంగళవారం భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను పర్యవేక్షించారు. ఆ క్రమంలో ఎయిర్పోర్ట్ టెర్మినల్, రన్ వే తదితర నిర్మాణాలను ఆయన పరిశీలించారు. అలాగే జాతీయ రహదారితో ఎయిర్పోర్ట్ కనెక్టవిటీ రోడ్డును సైతం ఆయన పరిశీలించారు. అదేవిధంగా విమానాశ్రయం భూసేకరణకు సంబంధించిన అంశాలను ఈ సందర్బంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు జిల్లా కలెక్టర్ డా. బి ఆర్ అంబేద్కర్ వివరించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటనలో విజయనగరం ఎం.పి. కలిశెట్టి అప్పలనాయుడు, శాసనసభ్యులు లోకం నాగ మాధవి, అదితి విజయలక్ష్మి గజపతిరాజు, జిల్లా ఉన్నతాధికారులతోపాటు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు సైతం పాల్గొన్నారు.