తిరుపతి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే అమాయకంగా మోసపోయారు.. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని రూ.50 లక్షల వరకు పోగొట్టుకున్నారు. జులై 5న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఎన్.ఆర్.జయదేవనాయుడుకి ఓ మహిళ వాట్సాప్ కాల్ చేసింది. ఆమె ' మీ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.కోట్లు బదిలీ అయ్యాయని గుర్తించామని.. నాయక్ అనే వ్యక్తిని మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్ట్ చేసి బ్యాక్ అకౌంట్ తనిఖీ చేస్తే మీ పేరు బయటకు వచ్చిందని' ఆయనతో చెప్పారు. 'ఈ కేసులో మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాం' అంటూ ఆ మహిళ జయదేవనాయుడ్ని బెదిరించారు. ఈ విషయంలో తన పై అధికారితో మాట్లాడాలని చెప్పి మరో వ్యక్తికి ఫోన్ ఇచ్చారు. సదరు వ్యక్తి కూడా మాజీ ఎమ్మెల్యేను బెదిరించాడు.. ఈ కేసుకు, తనకు సంబంధం లేదని జయదేవనాయుడు చెప్పినా వినలేదు. అక్కడితో ఆగకుండా సదరు వ్యక్తి మరోసారి ఆయన్ను బెదిరించాడు. తాము ఫోన్ చేసిన విషయం ఎవరికైనా చెబితే అరెస్టు చేస్తామని హెచ్చరించడంతో జయదేవనాయుడు భయపడ్డారు. ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి.. ' ఓ అకౌంట్ నంబర్ పంపిస్తాం.. వెంటనే దానికి రూ.50 లక్షలు బదిలీ చేస్తే.. తనిఖీ చేసిన తర్వాత తిరిగి ఆ డబ్బుల్ని వెనక్కు పంపిస్తామని'జయదేవనాయుడుకు చెప్పాడు. నిజమే అనుకున్న మాజీ ఎమ్మెల్యే.. శనివారం రోజు తన ఆరు అకౌంట్‌ల నుంచి ఆర్టీజీఎస్ ద్వారా రూ.50లక్షలు వారు చెప్పిన అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు.
ఆ తర్వాత జయదేవనాయుడు అమెరికాలో ఉన్న తన కుమారుడికి ఈ విషయాన్ని చెప్పాడు. అప్పుడు సైబర్ మోసం జరిగినట్లు గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేయాలని జయదేవనాయుడికి కుమారుడు సలహా ఇచ్చారు. ముందు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయగా.. ఎస్పీ సూచనలతో జయదేవనాయుడు తిరుపతి జిల్లా పాకాల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జయదేవనాయుడికి వచ్చిన ఫోన్ కాల్.. డబ్బులు పంపించిన అకౌంట్ ఆధారంగా ఆరా తీస్తున్నారు. సైబర్ మోసాల గురించి పోలీసులు హెచ్చరిస్తున్నా సరే.. మాజీ ఎమ్మెల్యే ఇలా భారీగా డబ్బులు పోగొట్టుకోవడం చర్చనీయాంశమైంది.