కాకినాడ జిల్లాలో అరుదైన జంతువును రక్షించే చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలో కోరింగ వన్యప్రాణి అభయారణ్యం ఉంది. ఆ ప్రాంతంలో అరుదైన నీటి పిల్లులు ఉన్నాయని తెలియడంతో.. వాటి పూర్వాపరాలను పవన్ కళ్యాణ్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. కోరింగ అభయారణ్యంలో అరుదైన ఫిషింగ్ క్యాట్ (నీటి పిల్లులు) ఉన్నాయని.. ఈ జాతి ఇక్కడ ఎంత ఉందో లెక్కలు సేకరించాలని పవన్ ఆదేశించారు. ఈ ఫిషింట్ క్యాట్‌లను రక్షించాలని.. అలాగే మడ అడవుల్ని సంరక్షించాలని ఆదేశించారు. మడ అడవులు అటవీ పరిధిలోకి రావని.. సుప్రీం కోర్టు తీర్పును పరిగణలోకి తీసుకోవాలని ఈ నెల 2న నిర్వహించిన సమీక్షలో చెప్పారు. దీంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు.. అభయారణ్యంలో ఫిషింగ్ క్యాట్ (నీటి పిల్లులు) గణనపై ఫోకస్ పెట్టారు. కోరింగ అటవీ ప్రాంతం గోదావరి పరివాహక ప్రాంతంలో విస్తరించింది ఉంది.. 2021లో ఎకో సెన్సిటివ్ జోన్ (రక్షిత అటవీ ప్రాంతం)గా కేంద్రం ప్రకటించింది. ఈ అభయారణ్యం పరిధిలోని వన్యప్రాణుల జాబితాలో అరుదైన ఫిషింగ్ క్యాట్ (నీటి పిల్లులు) సైతం ఉన్నాయి. అయితే 2018 నాటి లెక్కల ప్రకారం.. ఇక్కడ 118 వరకు పిల్లులు ఉన్నాయని గుర్తించారు. అయితే ఈ నీటి పిల్లుల జాతిపై అధ్యయనం చేసే బాధ్యతను డబ్ల్యూఐఐ (డెహ్రడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా)కి గతంలో అప్పగించారు. సీఎస్‌ఆర్ కింద అవసరమైన నిధుల్ని ఓ సంస్థ సమకూర్చింది. 2023 నాటికే గణన పూర్తిచేయాల్సి ఉన్నా అధ్యయనం ఓ కొలిక్కి రాలేదు.
ఈ ఫిషింగ్ క్యాట్‌లు కోరంగి అభయారణ్యంలో ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి?.. వీటి ఆహారపు అలవాట్లు,ఎలాంటి చేపలు తింటాయి?.. వాటి ప్రవర్తన ఎలా ఉంటుంది?.. వీటి సంరక్షణకు భవిష్యత్తులో ఏ చర్యలు చేపట్టాలి? వంటి అంశాలపై డబ్ల్యూఐఐ అధ్యయనం చేయాల్సి ఉంది. అభయారణ్యంలో కొన్ని పిల్లుల మెడకు రేడియో కాలర్స్ ఏర్పాటు చేసి, ట్రాన్స్‌మీటర్ సాంకేతికత ఆధారంగా వాటి సంచరాన్ని ఎప్పుటికప్పుడు తెలుసుకుంటే అటవీశాఖకు కొంత స్పష్టత వస్తుంది. అయితే కోరింగ అభయారణ్యంలో మొత్తం 100 కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ పిల్లుల సంచారాన్ని గుర్తించి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. డబ్ల్యూఐఐ సహకారంతో త్వరలో రేడియో కాలరింగ్ ఏర్పాటు చేస్తామని.. సమాచారం సేకరిస్తామంటున్నారు. ఈ వివరాలను సేకరించిన తర్వాత ఫిషింగ్ క్యాట్‌ల గణనపై క్లారిటీ వస్తుంది అంటున్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటించారు. పిఠాపురం నియోజకవర్గంలో పింఛన్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత కాకినాడ కలెక్టరేట్‌లో సమీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఫిషింగ్ క్యాట్‌ల ప్రస్తావన వచ్చింది. వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్.. వాటి గణన చెపట్టాలని ఆదేశించారు.