ఆస్పత్రి అంటే ప్రతీ క్షణం రోగుల ఆరోగ్య పరిస్థితిని చూసుకోవాల్సి ఉంటుంది. ఏదో ఒక అనారోగ్య సమస్యతో రోగులు ఆస్పత్రికి వస్తూ ఉంటారు. వారు డాక్టర్లను సంప్రదించి.. నయం కాని రోగం అయితే అదే ఆస్పత్రిలో అడ్మిట్ అవుతూ ఉంటారు. అయితే అడ్మిట్ అయిన పేషంట్ల బాధ్యత మొత్తం ఆ సమయంలో విధుల్లో ఉన్న నర్సులపైనే ఉంటుంది. పేషంట్లకు మందులు, ఇంజెక్షన్లు, సెలైన్లు ఎక్కిస్తూ వారిని నిత్యం ఓ కంట కనిపెడుతూనే ఉండాలి. అయితే ఈ నర్సులు మాత్రం ఆ పని వదిలేసి.. వారు ఇంకో పనిలో పడ్డారు. అది కూడా అంతా ఓ చోట చేరి.. కోతిపిల్లతో ఆటలు ఆడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అధికారులు వారిపై వేటు వేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో ఓ ప్రభుత్వ మహిళా ఆస్పత్రిలో ఈ సంఘటన జరిగింది. మహారాజా సుహెల్‌దేవ్ వైద్య కళాశాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రిలో కొందరు నర్సులు విధుల్లో నిర్లక్ష్యం వహించారు. డ్యూటీ టైంలో పని వదిలేసి కోతిపిల్లతో ఆటలు ఆడుతున్న దృశ్యాలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో సీరియస్ అయ్యారు. దీంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు మొత్తం ఆరుగురు నర్సులను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఘటనపై సుహెల్‌దేవ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎంఎం త్రిపాఠి స్పందించారు. ఆ ఆస్పత్రిలోని గైనకాలజీ ప్రసూతి డిపార్ట్‌మెంట్‌లో ఆ ఆరుగురు నర్సులు పనిచేస్తున్నట్లుగా గుర్తించినట్లు చెప్పారు. వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న ఆరుగురు నర్సులను.. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సంజయ్ ఖత్రీ.. జులై 5 వ తేదీనే విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు చెప్పిన త్రిపాఠి.. విచారణ జరిపేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న వేళ.. కోతితో ఆడటం.. దాంతో రీల్స్ చేయడం, పనిలో నిర్లక్ష్యంగా వ్యవహరించేలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోతో సుహెల్‌దేవ్ మెడికల్ కాలేజీ ప్రతిష్ట దెబ్బతింటుందని ప్రిన్సిపాల్ సంజయ్ ఖత్రీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కమిటీ విచారణ జరుపుతోందని.. ఆ కమిటీ నివేదిక అందేవరకు ఈ ఆరుగురిని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. నివేదిక ఆధారంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.