పలాస పట్టణ పరిధిలోని శివాజినగర్‌లో అక్రమంగా నిర్మి స్తున్న ఇంటి నిర్మాణాన్ని రెవెన్యూ అధికారులు మంగళవారం కూల్చివేశారు. శివాలయం రోడ్డు లో ఉన్న ఈ స్థలం ప్రభుత్వానికి చెందిన దని, శివాలయం అభివృద్ధికి ఇవ్వాలని స్థానికులు ఇటీవల రెవెన్యూ, మున్సిపల్ కమిషనర్, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషకు వినతిపత్రం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణం చేయవద్దని పలు మార్లు అధికారులు హెచ్చరించినా నిర్మాణం చేపట్టడంతో ఇంటి ముందు భాగాన్ని అధికారులు కూల్చివేశారు. బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. సీతారామ్‌నగర్ కాలనీకి చెందిన ఎం.నాగమ్మ తనకు 2009లో రెండు సెంట్ల స్థలాన్ని ప్రభుత్వం ఇచ్చినట్లు చెబుతోంది. ఖాళీస్థలానికి పన్ను కూడా చెల్లించామని, తాను లేని సమయంలో రెవెన్యూ అధికారులు భవనాన్ని కూల్చివేతకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆర్‌ఐ నిరంజన్, రెవెన్యూ అధికారులతో బాధిత కుటుం బం వాగ్వాదానికి దిగింది. ఈ వ్యవహారంపై తహసీల్దార్ ఎస్‌ఎస్‌వీఎస్ నాయుడును వివరణ కోరగా.. అవి నకిలీ పట్టాలని, తమ రికార్డుల్లో ఎటువంటి ఆధా రాలు లేవన్నారు. అక్రమ నిర్మాణం చేస్తున్నారన్న ఫిర్యాదుపై పరిశీలించామని, పలు మార్లు నిర్మాణం చేపట్టవద్దని హెచ్చరించినా వినిపించుకోలేదని, ఈ మేరకు చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.