గ్రామ, జిల్లా స్థాయి వరకు అంగన్‌వాడీ కార్యకర్త నుంచి సూపర్‌వైజర్లు, బాలల హక్కులు, వారి రక్షణ, సంరక్షణపై అవగాహన పెంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు డాక్టర్ జె.రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఏలూరు కలెక్టరేట్‌లో చైల్డ్ రైట్ అడ్వకసీ ఫౌండేషన్ క్రాప్ సంస్థ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ సహకారంతో బాలలకు అవసరమైన సంరక్షణ, రక్షణ, బాలల సంక్షేమ సమితి వారి దగ్గరకు ఎలా పంపించాలి అనే అంశంపై మంగళవారం అవగాహన కార్యక్రమం జరిగింది. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విధి విధానాలను తెలుసుకోవాలన్నారు. గ్రామాల్లో రక్షణ, సంరక్షణకు అవసరమైన బాలలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మండల స్థాయిలో సీడీపీవో ఆధ్వర్యంలో జరిగే సెక్టార్ సమావేశాల్లో చట్టాల పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఐసీడీఎస్ పీడీ పద్మావతి, చైల్డ్‌రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ పి.ప్రాన్సిస్ తంబి, సభ్యులు హైమావతి, క్రాప్ జిల్లా కో ఆర్డినేటర్ రవిబాబు, సిబ్బంది పాల్గొన్నారు.