హైదరాబాద్ కేంద్రంగా వైద్య సేవలందిస్తున్న కిమ్స్ హాస్పిటల్స్ (కృష్ణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆంధ్రప్రదేశ్‌లో తమ సామర్థ్యాన్ని విస్తరించుకుంటోంది. ఇందులో భాగంగా మరో హాస్పిటల్‌ను కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. విశాఖపట్నంలోని క్వీన్స్ ఎన్నారై హాస్పిటల్‌ను సొంతం చేసుకోనుంది. దీనికి సంబంధించిన షేర్ల కొనుగోలు అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు కిమ్స్ హాస్పిటల్స్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో విశాఖపట్నంలో కిమ్స్ హాస్పిటల్స్‌కి మరిన్ని పడకలు అందుబాటులోకి రానున్నాయి. షేర్ల కొనుగోలు ఒప్పందం ప్రకారం క్వీన్స్ ఎన్నారై హాస్పిటల్స్‌లో చలసాని హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఉన్న 100 శాతం వాటాను కిమ్స్ హాస్పిటల్స్ కొనుగోలు చేస్తోంది. ఈ కొనుగోలు కోసం రూ.75 కోట్లు మేర వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే డీల్ విలువపై కిమ్స్ హాస్పిటల్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు. వచ్చే నెల రోజుల్లో ఈ డీల్ పూర్తవుతుందని, క్వీన్స్ ఎన్నారై హాస్పిటల్ తమ అధీనంలోకి వస్తుందని కిమ్స్ వర్గాలు తెలిపాయి.
విశాఖపట్నం నగరం నడిబొడ్డున 1995లో క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ 200 పడకల సామర్థ్యంతో ప్రారంభించారు. కార్డియాలజీ, అంకాలజీ విభాగాల్లో సేవలందిస్తున్న హాస్పిటల్స్‌లో క్వీన్స్ ఎన్ఆర్ఐ కీలకంగా ఉంది. దీనికి దగ్గర్లో మరో ఆసుపత్రి లేకపోవడంతో ఎక్కువ మంది వైద్య సేవల కోసం ఇక్కడి వస్తుంటారు. మరోవైపు.. కిమ్స్ హాస్పిటల్స్‌కు వైజాగ్‌లో ఇప్పటికే ఓ మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రి, మరొక గ్యాస్ట్రో యూనిట్ ఉంది. ఇప్పుడు క్వీన్స్ ఎన్నారై ఆసుపత్రిని కొనుగోలు చేస్తుండడంతో వైజాగ్‌లో కిమ్స్ హాస్పిటల్స్ ప్రాతినిధ్యం మరింత విస్తరించనుంది. కిమ్స్ హాస్పిటల్స్ 2018లో వైజాగ్లోని కిమ్స్- ఐకాన్ హాస్పిటల్‌ను కొనుగోలు చేసింది. ఇప్పుడు క్వీన్స్ ఎన్‌ఆర్ఐ ఆసుపత్రిని కొంటోంది.
దీంతో తమకు వైజాగ్ నగరంలో మొత్తంగా 630 వైద్య పడకలు అందుబాటులోకి వస్తాయని కిమ్స్ సీఎండీ డాక్టర్ బి భాస్కరరావు తెలిపారు. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో వేగంగా వృద్ధి చెందేందుకు ఈ ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో తమ స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకునేందుకు అవసరమైన అవకాశాలను పరిశీలిస్తామని పేర్కొన్నారు. 2018లో ఐకాన్ హాస్పిటల్స్‌ను కొనుగోలు చేయడం ద్వారా వైజాగ్‌లో అడుగుపెట్టామని తెలిపారు.