తనపై నలుగురు వ్యక్తులు చాకుతో దాడి చేశారని, పోలీసులు వద్ద న్యాయం జరగడం లేదని, రేచర్లపేటకు చెందిన ఓ వ్యక్తి రక్తమోడుతున్న గాయాలతో కాకినాడ రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎం.ప్రసన్నలక్ష్మి ఎదుటకు వచ్చాడు. దీంతో వెంటనే అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఆమె పోలీసులను ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ పరిధిలోని రేచర్లపేటలో ఒక స్థల విషయంలో కుంచే ప్రభుతేజకి అదే ప్రాంతానికి చెందిన వారికి మధ్య కొంతకాలంగా గొడవ జరుగుతోంది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. కుంచే ప్రభుతేజ ఒక స్థలం విషయంలో మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించి, దాడి చేసిన కేసులో 2021లో టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు విచారణలో భాగంగా బుధవారం కాకినాడ రెండో అదనపు జూనియర్ సివిల్ కోర్టుకి నిందితుడు ప్రభుతేజ హాజరు కావాలి. అయితే కోర్టుకి వస్తుంటే నలుగురు వ్యక్తులు తనపై దాడి చేశారంటూ..రక్తమోడుతున్న గాయాలతో నిందితుడు ప్రభుతేజ కోర్టుకు హాజరయ్యాడు. వెంటనే అస్పత్రికి తీసుకెళ్లాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. ఈ ఘటన అనంతరం న్యాయమూర్తి బెంచ్ దిగి చాంబర్‌లోకి వెళ్లారు.