ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చింది ఇది సూపర్ సిక్సా? లేక సూపర్ మోసమా? అని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. పిల్లలని స్కూల్ కి పంపే అమ్మలకు ‘తల్లికి వందనం’ పథకం కింద రూ. 15,000 ఆర్థిక సహాయం అంటూ ఏపీ ప్రభుత్వం జీవో 29 పేరిట ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఎన్నికల ముందు ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలంటే అందరికి తల్లికి వందనం ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక మాట మార్చారని మాజీ మంత్రి మండిపడ్డారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 29ని విడుదల చేసిందని... ఈ జీవోను చదివితే.. చాలా అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఈ జీవో ప్రకారం ప్రతి ఏడాది తల్లికి వందనం కింద రూ.15వేలు అందిస్తామన్నట్టుగా రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంత మంది పిల్లలను స్కూల్‌కి పంపినా రూ.15వేలు ఇస్తామన్నారు. ఇది సూపర్ సిక్స్ కాదని.. సూపర్ మోసమని అభివర్ణించారు. ఇది తల్లికి వందనం కాదని.. తల్లికి మోసం కాదా చంద్రబాబు నాయుడు గారు అని కూటమి నాయకులను సూటిగా ప్రశ్నించారు. 2023లో రాష్ట్ర వ్యాప్తంగా 42,61,965 మంది తల్లుల ఖాతాల్లోకి రూ.6392 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి వేసారని... అంతమంది తల్లులను చంద్రబాబు మోసం చేసినట్టు కాదా అని అన్నారు. ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకుంటే... ఆయన నారాచంద్రబాబు నాయుడు ఎందుకు అవుతారన్నారు.