దేశం మొత్తం ఎదురుచూస్తున్న ఘడియ రానే వచ్చింది. ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారాన్ని అధికారులు తెరిచారు. ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆదివారం మధ్యాహ్నం 1.28 గంటలకు రహస్య గది తలుపులు తీశారు. 46 ఏళ్ల కిందట.. 1978 లో చివరిసారిగా ఈ రహస్య గదిని తెరవగా.. మళ్లీ ఇప్పుడు ఆ ప్రక్రియను చేపట్టారు. ఈ రత్న భాండాగారాన్ని తెరవడంలో 11 మంది పాల్గొంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పూరీ క్షేత్రంలో జగన్నాథునికి నిత్యం 119 మూలికా సేవలు జరుగుతాయి. వీటిని నిర్ణీత వేళల్లో సేవాయత్‌లు చేపడతారు. ఇక ఈ సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా రత్న భాండాగారాన్ని తెరిచారు. ఇక రత్న భాండాగారంలోని ఆభరణాల లెక్కింపు ప్రక్రియ మొత్తం డిజిటలైజేషన్ చేయనున్నారు.
ప్రస్తుతం పూరీ క్షేత్రంలో రథయాత్ర జరుగుతోంది. ఈ నెల 19 వ తేదీ వరకు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు ఆలయం బయట ఉండనున్నారు. దేవుడు లేని సమయంలో అధికారులు ఆ రహస్య గదిని తెరిచి లెక్కింపు చేపట్టారు. అయితే వాటిని లెక్కించేందుకు ఎన్ని రోజులు పడుతుంది అనేది మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు. ఇక ఆ రత్న భాండాగారం.. లోపల విషసర్పాలు ఉంటాయన్న వార్తల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు.. స్నేక్ హెల్ప్‌లైన్ నిపుణులు, అత్యవసర వైద్యానికి డాక్టర్లను కూడా అందులోకి పంపించినట్లు తెలుస్తోంది.
ఆ రహస్య గదిలో పూరీ జగన్నాథుని ఆభరణాలను 5 కర్రపెట్టెల్లో ఉంచి భద్రపరిచారు. పూర్వ కాలంలో ప్రతీ 3 లేదా 5 ఏళ్లకు ఒకసారి ఆ రత్న భాండాగారం తలుపులు తెరిచి సంపదను లెక్కించేవారు. అయితే చివరిసారి 1978లో ఈ లెక్కింపు ప్రక్రియ చేపట్టగా.. పూర్తి కావడానికి 70 రోజులు పట్టింది. ఇక అప్పుడు.. పూర్తిగా లెక్కించకుండా కొన్నింటిని వదిలేయడంతో ఆ లెక్కలపై తీవ్ర సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. భాండాగారాన్ని తెరిచి సంపదను లెక్కించాలని ఆదేశాలు జారీ చేయగా.. ఈ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. రహస్య గదుల్లోకి వర్షపు నీరు లీకై గోడలు పగుళ్లు వస్తున్నందున మరమ్మతులు చేయాలని 2018లోనే కోర్టులు పురావస్తు శాఖకు ఆదేశాలు జారీ చేశాయి.
ఇక గతంలో 2019 ఏప్రిల్ 6 వ తేదీన అప్పటి బీజేడీ నేతృత్వంలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం.. 13 మందితో ఒక కమిటీని నియమించింది. ఈ 13 మంది అధ్యయన సంఘం నేతలు ఆ రహస్య గది తలుపులు తెరిచేందుకు వెళ్లగా.. దాని తాళాలు కనిపించలేదు. దీంతో వారు వెనుదిరిగి.. ఆ ప్రక్రియను ఆపేశారు. ఆ తర్వాత మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై అధ్యయనం చేసేందుకు ఒడిశా ప్రభుత్వం జస్టిస్ రఘువీర్‌దాస్ కమిటీని ఏర్పాటు చేసింది. అదే సమయంలో ఆ రహస్య గదికి సంబంధించిన మరో తాళం చెవి పూరీ కలెక్టరేట్ ట్రెజరీలో ఉన్నట్లు తెలిసింది.
ఇక జస్టిస్ రఘువీర్ కమిటీ నివేదికను ప్రభుత్వం బయటికి వెల్లడించలేదు. ఇటీవల జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అంశాన్ని ప్రచార అస్త్రంగా చేసుకున్న బీజేపీ.. తాము ఒడిశాలో అధికారంలోకి వస్తే పూరీ రత్న భాండాగారాన్ని తెరిపిస్తామన్న ప్రచారం చేసింది. ఆ హామీకి కట్టుబడి.. అధికారంలోకి రాగానే రిటైర్డ్ జడ్జి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మందితో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ రత్న భాండాగారం తెరవాలని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రత్న భాండాగారం లోపల ఎలా ఉందో ఎవరికీ అవగాహన లేదని.. గత 46 ఏళ్లుగా అందులోకి ఎవరూ వెళ్లలేదని పేర్కొంది.