ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. పాలనలో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఇదే క్రమంలో అధికార యంత్రాంగంలోనూ మార్పులు చేర్పులు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలుసార్లు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను టీడీపీ కూటమి ప్రభుత్వం బదిలీ చేసింది. తాజాగా 37 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. పలు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా నూతన ఎస్పీగా కేవీ మహేశ్వరరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సోమవారం మధ్యాహ్నం తన ఛాంబర్‌లో ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం అదనపు ఎస్పీలు, డీఎస్పీలతో జిల్లా పరిస్థితులపై సమీక్షించారు.
అనంతరం మాట్లాడిన శ్రీకాకుళం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి.. తనకు ఎస్పీగా బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ శ్రీకాకుళం జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని తెలిపారు. మహిళల రక్షణకే మొదటి ప్రాధ్యానం ఇస్తామన్న ఎస్పీ మహేశ్వరరెడ్డి.. మహిళలపై దాడులు, మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టిసారిస్తామని స్పష్టం చేశారు. గంజాయి అక్రమ రవాణాపైనా కఠిన చర్యలు తీసుకుంటామన్న ఎస్పీ.. పోలీసుల పట్ల జిల్లా ప్రజలకు మరింత నమ్మకం కలిగేలా పనిచేస్తామని అన్నారు.
మరోవైపు జీఆర్ రాధిక స్థానంలో కేవీ మహేశ్వరరెడ్డిని ప్రభుత్వం శ్రీకాకుళం ఎస్పీగా నియమించింది. కడప ప్రాంతానికి చెందిన మహేశ్వరరెడ్డి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. పోలీస్ కావాలనే పట్టుదలతో ఐపీఎస్ అయ్యారు. 2019 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన కేవీ మహేశ్వరరెడ్డి.. విశాఖపట్నం గ్రేహౌండ్స్‌లో తొలిసారిగా పనిచేశారు. ఆ తర్వాత చింతూరు ఏఎస్పీగా నియమితులైన ఆయన.. రెండున్నరేళ్లు అక్కడ పనిచేసారు. అనంతరం రంపచోడవరం ఓఎస్‌డీగా మహేశ్వరరెడ్డి పనిచేశారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరరెడ్డి నిష్పక్షపాతంగా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకున్నారు. దీంతో ఓఎస్‌డీ నుంచి ఎస్పీగా కేవీ మహేశ్వరరెడ్డికి పదోన్నతి లభించింది.
జీఆర్ రాధిక స్థానంలో కేవీ మహేశ్వరరెడ్డిని ఏపీ ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా నియమించింది. దీంతో సోమవారం బాధ్యతలు స్వీకరించారు ఆయన. అనంతరం మంగళవారం అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వాగతం పలికి వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో అందజేశారు.