ఎర్రమట్టి దిబ్బలు.. తెలుగు ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులకు పరిచయమక్కర్లేని ప్రాంతం. ఇదో పర్యాటక ప్రాంతమే కాదు వారసత్వ సంపద కూడా. అయితే ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఎర్రమట్టి దిబ్బలు దోపిడీకి గురౌతున్నాయి. అక్రమంగా తవ్వేస్తున్నారు. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో గొంతెత్తారు. ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలంటూ పోరాటాలు చేశారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పోయి.. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వంలో జనసేనాని పవన్ కళ్యాణ్ భాగస్వామిగా ఉన్నారు. డిప్యూటీ సీఎం హోదాతో పాటుగా పర్యావరణ శాఖ మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు. అయితే ఇప్పటికీ అదే సమస్య కొనసాగుతోంది. దీనిపై జనసేన నేత స్పందించారు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలంటూ కోరారు.
జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. ఎర్రమట్టి దిబ్బల వ్యవహారంపై దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్‌ను కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు బొలిశెట్టి సత్యనారాయణ. "ఉమ్మడి విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు, ఇది కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు.. దేశంలో ఉన్న 29 జాతీయ భౌగోళిక వారసత్వ సంపదల్లో ముఖ్య భాగం. ఇలాంటివి దేశంలో రెండు మాత్రమే ఉన్నాయి. ఒకటి విశాఖ భీమిలి మధ్య, రెండవది తమిళనాడులోని పేరి వద్ద ఉన్నాయి. అలాంటి ప్రపంచ భౌగోళిక వారసత్వ సంపదపై యథేచ్చగా దాడి జరుగుతోందని నాకు సమాచారం వచ్చింది.. అధికారులు తక్షణమే స్పందించాలి.. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నా" అంటూ ఏపీ డిప్యూటీ సీఎంను ట్యాగ్ చేశారు బొలిశెట్టి.
మరోవైపు ఎర్రమట్టి దిబ్బల వ్యవహారంపై పవన్ కళ్యాణ్ గతంలో పోరాడారు. విపక్ష నేతగా ఉన్న సమయంలో ఎర్రమట్టి దిబ్బల దోపిడీపై గొంతెత్తారు. ఈ ప్రాంతాన్ని పరిశీలించి వీటిని కాపాడాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 1200 ఎకరాల్లో ఉండే ఎర్రమట్టి దిబ్బలు.. ఇప్పుడు కేవలం 292 ఎకరాలే మిగిలాయని అప్పట్లో పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఈ ప్రాంతంలో బఫర్ జోన్ ఏర్పాటు చేయాలని.. జాతీయ సంపదను కాపాడాలని అప్పట్లో పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎర్రమట్టి దిబ్బలు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని గొంతెత్తారు పవన్. ఈ నేపథ్యంలో ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావటంతో దీనిపై దృష్టిపెట్టాలని బొలిశెట్టి సత్యనారాయణ కోరుతున్నారు. ఇంకా తవ్వకాలు జరుగుతున్న విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు.