ప్రజలు వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. ఇప్పటికే ప్రజలు వైసీపీ పార్టీని అసహ్యించుకుంటున్నారని, ఆ 11 సీట్లు ఎందుకు ఇచ్చామా అని ప్రజలు ఆలోచిస్తున్నారని, పూర్తిగా భూస్థాపితం చేస్తే బాగుండనని అనుకుంటున్నారన్నారు. పేర్ని నాని బందర్‌ను ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఇప్పటివరకు పోర్టు అనేది పూర్తి చేయలేదని విమర్శించారు. చంద్రబాబు పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తారన్నారు. మచిలీపట్నానికి రూ. 70వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ తీసుకొస్తున్నారని, ఇక జగన్ అధికారంలోకి రావడం కలే అన్నారు. చంద్రబాబుకు మరో అవకాశం వచ్చినట్లు, వైసీపీకి కూడా మళ్లీ అధికారం వస్తుందని పగటి కలలు కంటున్నారన్నారు. చంద్రబాబు నాయుడు రెక్కల కష్టంతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని, బాబును ప్రజలు నమ్మారు కాబట్టి అధికారంలోకి వచ్చామని బుద్దా వెంకన్న అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మరోసారి నమ్మే అవకాశమే లేదన్నారు. వైసీపీ నేతలు కాజేసిన డబ్బు గురించి ప్రజలకు చెప్పడం తప్పా? అని ప్రశ్నించారు. జగన్ భవంతుళ్ళో ఉండొచ్చు కానీ, పేదవాళ్లు సొంత నివాసాల్లో ఉండకూడదా? అని నిలదీశారు. టిడ్కో ఇళ్లు జగన్ ఎందుకు పూర్తి చేయలేకపోయారు. గాలి మాటలు చెప్పడం వైసీపీ నేతలు మనుకోవాలన్నారు. 2024 నుంచి 2029 కాలంలో రాష్ట్రం పరుగులు పెడుతుందని, అసలు రాష్ట్రంలో ఎన్ని శాఖలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డికి తెలుసా?.. ఇప్పటికే ప్రజలు ఓటు రూపంతో వైసీపీ నేతలకు వాతలు పెట్టారని, నిజంగా కొలిమిలో కడ్డీ పెట్టి వాత పెట్టే దాకా తెచ్చుకోవద్దని బుద్దా వెంకన్న హతవుపలికారు.