కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం రాత్రి ఢిల్లీలో సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించేందుకు కేంద్రం, రాష్ట్రం అనుసరించాల్సిన ప్రణాళిక సహా అనేక అంశాలపై విస్తృతంగా చర్చించారు. రాత్రి 9.30 గంటల నుంచి 10.30 వరకు జరిగిన చర్చల్లో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి తమ ప్రభుత్వ ప్రాథమ్యాలు, ప్రాధాన్యాలను షా దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి సంబంధించి పొందుపరచాల్సిన అంశాలతో పాటు తక్షణం అవసరమైన నిధులు, మంజూరు చేయాల్సిన ప్రాజెక్టుల గురించి ప్రస్తావించినట్లు సమాచారం. రాష్ట్ర దుర్భర ఆర్థిక పరిస్థితి, గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వ నిర్ణయాలతో పరిస్థితులు ఎంత దిగజారాయో వివరించారు. జగన్ పాలనలో ఆర్థిక అసమర్థత, ఆర్థిక నిర్వహణలో తీవ్ర వైఫల్యం, విచ్చలవిడి అవినీతి వల్ల రాష్ట్రానికి ఎనలేని నష్టం జరిగిందని అమిత్ షాకు చెప్పినట్లు ఆ తర్వాత చంద్రబాబు విలేకరులకు తెలిపారు. ఎన్డీయేకి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడినపెట్టేందుకు, ఎకానమీ కోలుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర ప్రణాళికను రూపొందిస్తాయని చెప్పారు. 2019–24 మధ్య అలవిమాలిన విధంగా పెరిగిపోయిన రుణాలు, తద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అదుపు తప్పడంపై తాను నాలుగు శ్వేతపత్రాలను విడుదల చేశానని తెలిపారు. అనంతరం కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు టీడీపీ ఎంపీలతో చర్చించారు.