వినుకొండలో బుధవారం జరిగిన దారుణ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ రోజు రాత్రి వైసీపీ నేత రషీద్‌ను జిలానీ అనే వ్యక్తి నడిరోడ్డుపై కత్తితో దాడి చేసి చంపేశాడు. దీనిపై ఇప్పటికే టీడీపీ, వైకాపా నేతల మధ్య వార్ నడుస్తోంది. దీనికి తోడు ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ స్పందించడం అగ్నికి ఆద్యం పోసినట్లయింది. ఆయన బెంగళూరు పర్యటనను సైతం మధ్యలో ఆపేసి బాధిత కుటుంబాన్ని పరామర్శించేందకు వినుకొండకు వచ్చారు. అయితే ఘటనపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన తప్పుపట్టడంపై మంత్రి డోలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి డోలా మాట్లాడుతూ.." ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించినా జగన్ మాత్రం తన బుద్ధి మార్చుకోలేదు. సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డిని సైతం చంపి నారాసుర రక్త చరిత్ర అంటూ పుస్తకం రాసి టీడీపీపై తప్పుడు ప్రచారాలు చేశారు. వినుకొండలో జరిగిన హత్యకు ముఖ్యకారకుడు జగనే. వైసీపీ హయాంలో హతుడు రషీద్, నిందితుడు జిలానీ మధ్య జరిగిన గొడవలపై అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే నేడు ఈ హత్య జరిగేదా?. ఆనాడు జగన్ చేసిన పాపానికి ఇవాళ ఓ వ్యక్తి తన నిండు ప్రాణాన్ని మూల్యంగా చెల్లించాల్సి వచ్చింది. జగన్ ఇకనైనా శవ రాజకీయాలు మానుకోవాలి. లేదంటే ప్రజలే ఆయణ్ని శాశ్వతంగా రాజకీయాల నుంచి పంపించేస్తారు" అని అన్నారు.