ఐదేళ్ల పాలనలో వైసీపీ నాయకులు చేసిన భూ కబ్జాలపై విచారణ చేయించి అక్రమాలు వెలికి తీస్తామని టీడీపీ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. వారి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. గురువారం ఎర్రగొండపాలెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. వైసీపీ పాలనలో భూ దందాలు, సహజవనరుల దోపిడిని ఆయన వివరించారు. మాజీ మంత్రి సురేష్, వైసీపీ నాయకులు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో సహజ వనరులను దోపీడీ చేశారన్నారు. గత ప్రభుత్వంలో సచివాలయలకు వచ్చిన ఇసుకను అధికారపార్టీ నేతలు 24 వేల టన్నులు అక్రమంగా అమ్ముకొని రూ.3 కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. ఇసుక దోపీడీపై అప్పట్లో కలెక్టరుకు ఫిర్యాదు చేస్తే ఆయన కేసు నమోదుకు ఆదేశించారన్నారు. అయినప్పటికీ, అప్పటి మంత్రి ఒత్తిడితో ఫిర్యాదు ను బుట్ట దాఖలు చేశారన్నారు. ఇసుక మేతలపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. అదే విధంగా మిల్లంపల్లి జగనన్న కాలనీలో పట్టాలు వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారన్నారు. మిల్లంపల్లి కాలనీలో పట్టాల లెక్కతేలలేదని అన్నారు. త్వరలోనే ప్రత్యేక అధికారి ద్వారా విచారణ చేయిస్తామన్నారు. రాళ్లవాగు అక్రమణలకు గురైందని అన్నారు. భూదందాలను నివారించేందుకు సీఎం చంద్రబాబునాయుడు త్వరలోనే ల్యాండ్ గ్యాబ్రింగ్ (ప్రొబేషన్) యాక్టును తీసుకొస్తారని అన్నారు. వైసీపీ నేతల చేతిలో దోపిడీకి గురైన బాధితులకు భూములను త్వరలోనే వెనక్కు ఇప్పిస్తామని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు చేకూరి సుబ్బయ్య, పయ్యావుల ప్రసాద్, టీడీపీ ముఖ్య నాయకులు కామేపల్లి వెంకటేశ్వర్లు, వెంగళరెడ్డి, కాకర్ల కోటయ్య, రెంటపల్లి సుబ్బారెడ్డి, సత్యనారాయణ గౌడ్, మంత్రునాయక్, వలీ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.