దేశ రాజధాని ఢిల్లీలో భారత పర్యటనకు వచ్చిన విదేశీయులు ఆటోలో వెళ్తుండగా.. ఇద్దరు చిన్నారులు వారిని అడిగారు. అయితే వారు ఇవ్వకపోవడంతో.. ఆ ఆటో వెనకాలే పరిగెత్తారు. అది చూసి.. ఆ విదేశీయులు షాక్ అయ్యారు. అందులో ఓ చిన్నారి ఏకంగా వేగంగా వెళ్తున్న ఆటోను ప్రమాదకరమైన రీతిలో పట్టుకోవడంతో అందులోని విదేశీయులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆ విదేశీయులు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. భారత్‌లో ఇలాంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయని.. డబ్బుల కోసం ఇద్దరు చిన్నారులు.. ఇలా విదేశీయుల ముందు ప్రవర్తించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
భారత పర్యటనకు వచ్చిన పలువురు విదేశీ పర్యాటకులకు ఢిల్లీలో ఊహించని పరిస్థితి ఎదురైంది. వారు ఢిల్లీ నగరాన్ని చూసేందుకు ఓ ఆటోను ఎక్కారు. అయితే అక్కడ బిచ్చం ఎత్తుకుంటున్న ఓ ఇద్దరు బాలికలు వారిని డబ్బులు అడిగారు. వారు ఇవ్వకపోవడంతో.. అప్పుడే ఆటో కదలగా.. దాని వెంటనే పరిగెత్తారు. ఆటో వేగంగా వెళ్లడంతో.. ఓ బాలిక దాన్ని పట్టుకుని ప్రమాదకరమైన రీతిలో ప్రయాణం చేసింది. మరో బాలిక ఆ ఆటో వెంట వేగంగా పరిగెత్తింది. దీనికి సంబంధించిన దృశ్యాలను ఆ విదేశీయులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఆ ఇద్దరు బాలికలు తమ వెంట పడటంతో ఆ విదేశీయులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఇది చాలా దారుణం.. ఏం జరుగుతుందో నమ్మలేకపోతున్నా అంటూ.. వీడియో తీస్తున్న ఓ విదేశీయుడు అనడం ఆ వీడియోలో రికార్డ్ అయింది. అయితే ఇంత జరుగుతున్నా అదేమీ పట్టించుకోకుండా ఆ ఆటో డ్రైవర్ అలాగే ఆటోను పోనివ్వడం గమనార్హం. ఢిల్లీలో ఇలాంటి పరిస్థితులు సర్వ సాధారణమే అన్నట్లు అతడి వైఖరి ఉండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ఢిల్లీకి వచ్చే విదేశీ పర్యటకులకు చాలామందికి ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయంటూ కొందరు విమర్శలు గుప్పించారు. గతంలోనూ ఇలాంటి వీడియోలు సోషల్ మీడియోలో వైరల్ అయ్యాయని గుర్తు చేస్తున్నారు. యూత్ రీచ్ అనే ఎన్జీవో వెల్లడించిన గణాంకాల ప్రకారం.. కేవలం దేశ రాజధాని ఢిల్లీలోనే దాదాపు 70 వేల మంది వీధి బాలలు ఉన్నారని.. వారిలో సగానికి పైగా భిక్షాటన చేస్తూనే రోజూ జీవనం సాగిస్తున్నారని పేర్కొంది.