ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న విమాన ప్రయాణాలపై మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలు నిలిచిపోవడంతో ఎఫెక్ట్ పడింది. దీంతో ఎక్కడికక్కడే ప్రయాణికులు.. ఎయిర్‌పోర్టుల్లో పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు.. మైక్రోసాఫ్ట్ విండోస్ సేవల్లో తలెత్తిన అంతరాయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. మైక్రోసాఫ్ట్ సంస్థతో నిరంతరం టచ్‌లో ఉన్నామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. ఇక ఈ సాంకేతిక సమస్యకు కారణాలను గుర్తించినట్లు ట్వీట్ చేశారు. సమస్య పరిష్కారానికి అప్‌డేట్‌లు విడుదలయ్యాయని అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు.
ఈ క్రమంలోనే ఈ మైక్రోసాఫ్ట్ విండోస్ అంతరాయంతో నేషనల్ ఇన్‌ఫర్మాటిక్స్ సెంటర్ నెట్‌వర్క్‌పై ఎలాంటి ప్రభావం పడలేదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఈ సమస్యకు సంబంధించి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్.. సాంకేతిక సలహాలను జారీ చేస్తుందని తెలిపారు. విండోస్ హోస్ట్స్‌కు సంబంధించిన క్రౌడ్ స్ట్రైక్ ఏజెంట్ ఫాల్కన్ సెన్సర్‌ను అప్‌డేట్ కారణంగానే ఈ సమస్య వచ్చిందని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తన అడ్వైజరీలో వెల్లడించింది. క్రౌడ్ స్ట్రైక్ టీమ్ మార్పులను రివర్ట్ చేసిందని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ విండోస్‌లో టెక్నికల్ సమస్య రావడంతో ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపిస్తోంది. భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.
మరోవైపు.. మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన ఈ టెక్నికల్ సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతోంది. విమానాలు ఆలస్యం కావడం.. మరికొన్ని రద్దు కావడంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లోని కొన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు కొన్ని సేవలను మాన్యువల్‌గా నిర్వహిస్తున్నాయి. ఇండిగో, విస్తారా, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్ వంటి ఎయిర్‌లైన్ సంస్థల పనితీరుపై.. మైక్రోసాఫ్ట్ విండోస్ టెక్నికల్ సమస్య భారత్‌లో తీవ్ర ప్రభావం పడింది.
దీంతో ప్రయాణికులను మాన్యువల్‌గా చెక్ చేసి.. చేతి రాసి బోర్డింగ్ పాస్‌లు అందిస్తున్నారు. ఇలాంటి బోర్డింగ్ పాస్‌లను పలువురు ప్రయాణికులు సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఇక తన ప్రయాణానికి ముందు ఇలా చేతితో రాసిన బోర్డింగ్ పాస్ ఫోటోను నేషన్‌హెచ్‌క్యూ కో ఫౌండర్ అక్షయ్ కొఠారీ.. ట్విటర్‌లో షేర్ చేశారు. మైక్రోసాఫ్ట్‌లో ఏర్పడిన సమస్య కారణంగా తమ ఆన్‌లైన్ సేవలపై తీవ్ర ప్రభావం పడిందని.. అయితే సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరించి.. సేవలు పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని ప్రయాణికులకు ఎయిర్‌లైన్ సంస్థలు సూచిస్తున్నాయి.