నీట్ విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదిలావుంటే అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్-2024 అంశంపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ కొనసాగుతోంది. నీట్ నిర్వహణలో అక్రమాలు జరిగాయని, పేపర్ లీకయ్యిందని ఆరోపిస్తూ పలువురు విద్యార్థులు పిటిషన్లు దాఖలు చేశారు. పరీక్షను రద్దుచేసి, మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నాయి. కొన్ని కేంద్రాల్లో కేవలం పరీక్షకు 45 నిమిషాల ముందు మాత్రమే పేపర్ లీక్ అయ్యిందని అంటున్నాయి. ఈ ఏడాది మే 5న దేశవ్యాప్తంగా 4,700కిపైగా కేంద్రాాల్లో నిర్వహించిన నీట్-యూజీ పరీక్షకు దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
గురువారం నాటి విచారణ సందర్భంగా నీట్ అంశంపై సీబీఐ దర్యాప్తు నివేదికను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమర్పించారు. ఝార్ఖండ్ హజరీబాగ్‌లోని ఓ కేంద్రంలో నీట్ ప్రశ్నాపత్రం పరీక్ష జరిగిన రోజున ఉదయం 8 గంటల నుంచి 9.20 మధ్య లీక్ అయ్యిందని ఆయన వివరించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. పరీక్ష ఉదయం 10.15 గంటలకు ప్రారంభమైంది.. మరి కేవలం 45 నిమిషాల్లోనే 180 ప్రశ్నలను పూర్తిచేయడం సాధ్యమవుతుందా? అని విస్మయం వ్యక్తం చేసింది.
గ్యాంగులోని ఏడుగురు వ్యక్తులున్నారని, వారంతా ప్రశ్నలను విభజించుకుని ఒక్కో సెక్షన్ పూర్తిచేశారని తుషార్ మెహతా బదులిచ్చారు. పిటిషనర్ల తరఫు హాజరైన సీనియర్ న్యాయవాది నరేందర్ హుడా.. నీట్-యూజీ 2024ను నిర్వహించడంలో ఎన్టీఏ పూర్తిగా విఫలమైందని, పరీక్షను రద్దు చేయాలని గట్టిగా కోరారు. ప్రశ్నపత్రాల రవాణాలో అలసత్వం జరిగిందని, హజారీబాగ్‌లో ఆరు రోజులు ఓ ప్రైవేట్ కొరియర్ కంపెనీ వద్దే ఉన్నాయని ఆయన ఆరోపించారు. వాటిని పరీక్షా కేంద్రానికి ఇ-రిక్షాలో తరలించారని, రాకెట్‌లో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేశారని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం.. పేపర్ లీక్ పెద్ద మొత్తంలో ప్రభావం చూపినట్టు రుజువైతేనే రీటెస్ట్ నిర్వహించే విషయమై నిర్ణయం తీసుకుంటామని పునరుద్ఘాటించింది. అనంతరం విచారణను జులై 22కు వాయిదా వేసింది. మరోవైపు, నీట్ లీక్ అంశంపై దర్యాప్తు జరుపుతోన్న సీబీఐ.. గురువారం బిహార్‌లో నలుగురు వైద్యులను అరెస్ట్ చేసింది. పట్నాలోని ఎయిమ్స్‌లో పనిచేస్తోన్న ఈ వైద్యులు.. ప్రశ్నాపత్రం లీక్‌లో కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువుర్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, నిందితుల గదులకు సీల్ వేసిన సీబీఐ.. ల్యాప్‌టాప్, మొబైల్‌ను స్వాధీనం చేసింది. ఈ ముగ్గుర్నీ 2021 బ్యాచ్‌కు చెందిన వైద్య విద్యార్ధులుగా గుర్తించారు.