మధ్యంతర బెయిల్ కోరుతూ బిల్కిస్ బానో అత్యాచార దోషులకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. వారు వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ప్రస్తుతం దోషుల క్షమాభిక్ష వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉండటంతో రాధేశ్యామ్ భగవాన్‌దాస్, రాజూభాయ్ బాబూలాల్ తమకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు.. వారి పిటిషన్‌ని కొట్టివేస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ఐదు నెలల గర్భవతి అయిన బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండుగులు.. ఆమె కుటుంబంలోని ఏడుగుర్ని దారుణంగా హత్య చేశారు.
ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులను 2008లో దోషులుగా నిర్దారించిన ప్రత్యేక న్యాయస్థానం.. యావజ్జీవ ఖైదు విధించింది. అయితే, 2022 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన పేరుతో వారికి గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేసింది. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. తన కుటుంబసభ్యులను కోల్పోయి.. జీవచ్ఛంలా బతుకున్న బాధితురాలు తీవ్ర మనస్తాపానికి గురైంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఆమె ఆవేదనలో అర్దముందని, బిల్కిస్ బానో సవాల్ చేయడం సరైనదేనని స్పష్టం చేసింది. దోషులను విడుదల చేయాలనే నిర్ణయాన్ని తప్పుబట్టింది. అంతేకాదు, ప్రభుత్వానిది బుద్దిలేని నిర్ణయమని ఘాటుగా స్పందించింది. ఇది తీవ్రమైన అధికార దుర్వినియోగమని, ఓ మహిళపై అత్యంత క్రూరంగా వ్యవహరించవారికి శిక్షనను ఎలా తగ్గిస్తారని నిలదీసింది.
దీంతో గుజరాత్ ప్రభుత్వం ఆ ఉత్తర్వులను రద్దుచేసి దోషుల్ని మళ్లీ అరెస్ట్ చేసింది. తాజాగా, ఇద్దరు దోషులు మధ్యంతర బెయిల్ కోసం మళ్లీ పిటిషన్ వేయగా సుప్రీంకోర్టు ఎదుట దోషులకు చుక్కెదురైంది. ఇక, 15 ఏళ్ల జైలు శిక్ష అనంతరం తమను విడుదల చేయాలని కోరుతూ ఓ దోషి 2022లో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ విషయాన్ని పరిశీలించాలని గుజరాత్ ప్రభుత్వంతో పాటు ఆ రాష్ట్ర హైకోర్టు కోరింది. కోర్టు సూచనతో ఓ కమిటీ నియమించి గుజరాత్ సర్కారు.. దానికి సిఫారసుల ఆధారంగా 11 మందికి క్షమాభిక్ష ప్రసాదించింది.