సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే ప్రధాన అజెండాగా పనిచేయాలని ఎంపీలకు సూచించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వీలైనన్ని నిధులు రాబట్టాలని సూచించారు. అవసరమైతే ఇందుకు మంత్రుల సహకారం తీసుకోవాలన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన సమాచారం మంత్రుల నుంచి తీసుకుని.. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. అవసరమైతే.. మంత్రులకు కూడా ఢిల్లీకి తీసుకువెళ్లాలని చెప్పారు.
ఇదే సమయంలో జులై 24న వైఎస్ జగన్ ఢిల్లీ ధర్నా అంశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. అయితే దీనిపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఎంపీలు అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన సహకారం, నిధులపై దృష్టిపెట్టాలని చంద్రబాబు సూచించినట్లు తెలిసింది. వైఎస్ జగన్, వైసీపీ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదని చంద్రబాబు ఎంపీలతో అన్నట్లు సమాచారం. వైఎస్ జగన్ గురించి ఆలోచించే ఒక్క క్షణం సమయాన్ని కూడా రాష్ట్రం కోసం ఆలోచించాలని ఓ మంత్రి సమావేశంలో అభిప్రాయపడినట్లు సమాచారం. అయితే వైఎస్ జగన్ ఢిల్లీలో ఏం చేస్తారనేదీ ముఖ్యం కాదని.. మనం ఏం చేయాలనే ముఖ్యమని చంద్రబాబు ఎంపీలతో అన్నట్లు తెలిసింది. వైఎస్ జగన్ ధర్నాను పట్టించుకోవాల్సిన పనిలేదని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.
అయితే ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపిస్తున్నారు. వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబసభ్యులను శుక్రవారం వైఎస్ జగన్ పరామర్శించారు. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయ ప్రేరేపిత దాడులు పెరిగాయన్న వైఎస్ జగన్.. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. అందులో భాగంగా జులై 24న ఢిల్లీలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ధర్నా చేయనున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. అనంతరం రాష్ట్రపతి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఏపీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తామని వైఎస్ జగన్ తెలిపారు.