టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే మాత్రం అధికారుల తీరుపై వినూత్నంగా నిరసన తెలిపారు. అధికారుల తీరును నిరసిస్తూ.. వర్షంలో తడుస్తూ నిరసన తెలిపారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో చోటుచేసుకుంది. తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే కొలికపుడి శ్రీనివాసరావు శనివారం తిరువూరు పట్టణంలో ఆకస్మికంగా పర్యటించారు. ఎమ్యెల్యే పర్యటించిన సమయంలో ఓ వార్డులో రోడ్డుపై వర్షపు నీరు నిలిచి ఉంది. దీంతోరోడ్లు భవనాల శాఖ అధికారుల నుంచి వివరణ తీసుకునేందుకు వారి కోసం గంట పాటు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వర్షంలో నిరీక్షించారు. వర్షంలో తడుస్తూనే అధికారుల తీరుపై నిరసన తెలిపారు. గుంతలను ఎందుకు పూడ్చలేదంటూ రోడ్లు భవనాల శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు ఎమ్మెల్యే రావటంతో స్థానికులు కూడా తమ సమస్యలను ఏకరువు పెట్టారు. రోడ్ల గుంతలు పూడ్చకపోవటం వలన, మరమ్మత్తులు చేయకపోవటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అధికారులపై మండిపడిన కొలికపూడి శ్రీనివాసరావు.. రోడ్ల మరమ్మత్తులకు మంజూరైన నిధులు ఏమయ్యాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోడ్ల మరమ్మతులు ఎప్పటిలోగా పూర్తిచేస్తారో స్పష్టమైన హామీ ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. అయితే ఎమ్మెల్యే వర్షంలో తడుస్తూ అధికారుల తీరుపై నిరసన తెలపడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సోషల్ మీడియాలో వైరల్ కావటం ఇదే తొలిసారేమీ కాదు. ఇటీవలే సత్వర న్యాయం పేరుతో వైసీపీ ఎంపీపీ నాగలక్ష్మి ఇంటిని కూల్చివేసిన ఘటనలోనూ ఆయన చర్చనీయాంశమయ్యారు. దీనిపై పోలీసులు కొలికపూడి శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు సైతం ఆయనను మందలించినట్లు వార్తలు వచ్చాయి. దూకుడైన చర్యలు వద్దంటూ, ఓర్పు, సహనంతో ఉండాలంటూ ఆయనకు సూచించినట్లు తెలిసింది. అయితే ఈ ఘటన జరిగి నెలరోజులు తిరగకుండానే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వార్తల్లో నిలిచారు.
మరోవైపు అమరావతి రైతు ఉద్యమ నేతగా కొలికపూడి శ్రీనివాసరావు ఫేమస్ అయ్యారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతరం తొలి జాబితాలోనే ఆయనకు తిరువూరు టికెట్ కేటాయించారు చంద్రబాబు. ఇక ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థి నల్లగుట్ల స్వామిదాసుపై కొలికపూడి శ్రీనివాసరావు విజయం సాధించారు. నల్లగుట్ల స్వామిదాస్ మీద 21 వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించి తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.