ఏలూరు జిల్లాలో కామవరపుకోట మండలం కేస్ రామవరంలో బోరు ఉంది.. దాని నుంచి నీరు ఎగిసిపడుతోంది. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బోరు ఉన్న ప్రాంతం చుట్టూ వరద నీరు చేరింది. దీంతో బోరు ఆన్ చేయకుండానే నీరు వస్తుండడంతో స్థానికులు అవాక్కయ్యారు. ఒక్కసారిగా బోరు నుంచి నీరు ఉబికి వస్తుండగా స్థానికులు వీడియో రికార్డ్ చేశారు.
వరద నీరు కారణంగా ఓవర్ ఫ్లోతోనే బోరు నుంచి నీళ్లు ఇలా ఉబికి వస్తున్నాయంటున్నారు స్థానికులు. గతంలో కొన్ని వందల అడుగుల్లో బోరు వేసినా నీళ్లు రాని పరిస్థితి ఉంది.. ఇప్పుడు వర్షాల కారణంగా మోటార్ ఆన్ చేయకుండానే నీళ్లు బోరు నుంచి ఉబికి వస్తోంది. ఈ బోర్ ఆన్ చేయకుండానే నీరు వస్తుండటంతో స్థానికులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈ విషయం తెలియడంతో జనాలు వెళ్లి చూస్తున్నారు.
మరోవైపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. వరి నారుమళ్లు, నాట్లు వేసిన పొలాలు ముంపులో చిక్కున్నాయి. ఈదురుగాలులతో చెట్లు కూలిపోయి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరో రెండు, మూడు రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణశాఖ హెచ్చరించడంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వర్షాలు కురుస్తుండటంతో కలెక్టర్ నాగరాణి క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేశారు. తణుకు మండలం దువ్వ ప్రాంతంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణతో కలిసి పరిశీలించారు. యనమదుర్రు డ్రెయిన్‌లో వరద పెరగడంతో.. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. కొత్తపేట కాలనీ దగ్గర ముంపులో ఉన్న గుడిసెలను సందర్శించి అక్కడివారిని పునరావాస కేంద్రానికి పంపించారు. అలాగే కలెక్టరేట్‌లో ఇప్పటికే కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు మూడు రోజులుగా కురుస్తున్న వానలకు ఎర్ర కాలువకు వరద పోటెత్తింది. దీంతో సుమారు 9500 ఎకరాలు నీట మునగగా.. పలు ప్రాంతాలు నీటమునిగాయి.