కడప జిల్లా జమ్మలమడుగులో జమ్మలమడుగు బైపాస్ నుంచి శేషారెడ్డిపల్లె వెళ్లే మార్గంలో పొలాల గట్ల వెంట వాడి పడేసిన సిరంజీలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. రైల్వే గేటు దాటగానే రోడ్డు పక్కన 2.5 ఎం.ఎల్ సిరంజీలు సూదితో సహా గుర్తు తెలియని వ్యక్తులు పడేశారు. పొలాల్లో, గట్లపై ఈ సిరంజీలు ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సిరంజీలు రక్త పరీక్షలవా? మత్తు పదార్థాల కోసం వాడినివా? అనే అనుమానాలు మొదలయ్యాయి.
గతంలో ఇలాంటి సిరంజీలు ఎప్పుడూ చూడలేదని రైతులు, వాకింగ్‌కి వెళ్లే స్థానికులు చెబుతున్నారు. కొంతమంది గతంలో మద్యం తాగి సీసాలను పొలాల్లో పడేస్తుంటే రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఆ ప్రాంతంలో పోలీసులు గస్తీ చేపట్టారు. ఆ తర్వాత నిఘా పెట్టేలేదని రైతులు, స్థానికులు అంటున్నారు. ఇప్పుడు పొలం వెంబడి లా సిరంజీలు కనిపిస్తున్నాయని.. వీటి సంగతి తేల్చాలని కోరుతున్నారు.
ఆ చుట్టుపక్కల ప్రాంతంలో వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయని.. పొలాల్లో పని చేసే సమయంలో అవి గుచ్చుకుంటే తమ పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణంగా 3, 5, 10 ఎం.ఎల్ సిరంజీలు ఉంటాయని.. కానీ 2.5 ఎంఎల్ సిరంజీలు వాడరని చెబుతున్నారు. ప్రభుత్వం కూడా ఇలా 2.5 ఎంల్ సిరంజీలు సరఫరా చేయదని వైద్యఆరోగ్యశాఖ అధికారులు అంటున్నారు. ఈ సిరంజీల వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది.