ఆంధ్రప్రదేశ్‌లో తహసీల్దార్లు ఎన్నికల సమయంలో తహసీల్దార్లను బదిలీ చేయగా.. వారిని మళ్లీ సొంత జిల్లాలకు బదిలీపై వెళ్లబోతున్నారు. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 650 మంది తహసీల్దార్లను మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో బదిలీ చేయగా.. నిబంధనలు అనుసరించి ఇతర జిల్లాలకు పంపించారు.
అయితే ఏపీలో ఎన్నికల నియమావళి జూన్ 6వ తేదీతో ముగియడంతో.. తహసీల్దార్లను గతంలో పనిచేసిన స్థానాలకు తిరిగి పంపాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఇటీవల ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఇతర ఉద్యోగ సంఘాల నేతలు మంత్రి అనగాని సత్యప్రసాద్‌ని కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి.. తహసీల్దార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఈ బదిలీల ప్రక్రియ పూర్తయిన తర్వాత కలెక్టర్ వారికి మండలాలను కేటాయించనున్నారు. జిల్లాలకు వచ్చే రెవెన్యూ అధికారులను ఆయా మండలాల్లో అదే కేడర్‌కు పంపించనున్నారు. కలెక్టరేట్, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, వివిధ భూసేకరణ విభాగాల్లో వీరికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
మరోవైపు ఏపీలో వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయం శాఖ డైరెక్టర్ ఎన్ ఢిల్లీరావు కీలక ప్రకటన చేశారు. రైతులు అధిక దిగుబడులిచ్చే వంగడాలను ఎంపిక చేసుకుంటారని.. కాబట్టి డిమాండ్ మేరకు వాటిని అందుబాటులో ఉంచాలని అధికారుల్ని ఆదేశించారు. ఢిల్లీరావు మంగళగిరిలోని వ్యవసాయశాఖ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సేంద్రీయసాగు విధానాలపై సిబ్బంది విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లాల్లో అధికారులకు సూచన చేశారు.
మరోవైపు ఏపీలోని ఐదు మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాదే జాతీయ వైద్య కమిషన్ అనుమతి నిరాకరించిన ఎంబీబీఎస్ ప్రవేశాలకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు ప్రిన్సిపల్స్. ఈ మేరకు ఆయా కాలేజీల ప్రిన్సిపల్స్ లేఖలు రాశారు. పాడేరు, ఆదోని, నంద్యాల, మదనపల్లె, పులివెందుల కాలేజీల్లో 2024-25కి సంబంధించిన ప్రవేశాలకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం గతంలో ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేసింది. ఈ కాలేజీలను తనిఖీ చేసిన ఎన్‌ఎంసీ టీమ్.. ఇక్కడ ఫ్యాకల్టీ సరిపడా లేరని, తరగతుల నిర్వహణకు తగ్గట్లు నిర్మాణాలు లేవని అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా ప్రవేశాలకు ఎన్‌ఎంసీ అనుమతి నిరాకరించింది. తనిఖీల్లో గుర్తించిన లోపాలను త్వరలో పరిష్కరిస్తామని.. సరైన వసతులు సమకూరుస్తామని హామీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఎన్‌ఎంసీకి మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్స్‌కు విజ్ఞప్తి చేశారు.