ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు తక్కువ ధరకే టమాటాలను విక్రయిస్తోంది. టమాటా ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులకు తక్కువ ధరకే అందిస్తోంది. బయట మార్కెట్లో టమాటా కిలో రూ.80 వరకు పలుకుతుంటే.. రైతు బజార్ల ద్వారా కేజీ రూ.58కి ప్రభుత్వం అందిస్తోంది. రైతుల నుంచి పంటను కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. రైతు బజార్లలో మనిషికి కేజీ చొప్పున టమాటాలను అందజేస్తున్నారు. లాభం, నష్టం లేకుండా కొనుగోలు ధరకే అంటే రూ.58కే విక్రయిస్తున్నారు. ఈ ధర ఏ రోజుకు ఆరోజు మారుతుందన్నారు.
టమాటా ధరలు భారీగా పెరిగాయి.. మార్కెట్‌లలో 10 రోజులకు ముందు 15కిలోల బాక్సు రూ.300నుంచి రూ.350 మధ్య పలికింది. ఇప్పుడు అదే బాక్స్ రూ.900నుంచి రూ.1000కు చేరింది. జులై నెల మొదటివారంలో ధరలు అంతంతమాత్రంగా ఉన్నాయి.. వర్షాలతో రైతులు ఇబ్బందులు పడ్డారు. కానీ ధరలు మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పంటలు దెబ్బ తినడం.. ఇతర రాష్ట్రాల్లో పంట అంతంతమాత్రంగానే ఉంది. ఏపీకి పొరుగునే ుణ్న తమిళనాడులో పంట లేకపోవడంతో అక్కడి వ్యాపారులంతా పుంగనూరు, పలమనేరు, మదనపల్లి టమాటా మార్కెట్ల వైపు చూస్తున్నారు. మార్కెట్‌లకు వచ్చే టమాటాల కోసం తమిళనాడు, కేరళ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు పోటీ పడుతున్నారు.
మరోవైపు అనంతపురం రూరల్ కక్కలపల్లి మార్కెట్‌కు గత మూడ్రోజులుగా టమాటాలు భారీగా వస్తున్నాయి. అక్కడ ధర కిలో రూ.60 వరకు పలికింది అంటున్నారు. బుట్ట ప్రకారం గరిష్ఠ ధర రూ.900, మధ్యస్థంగా ధర రూ.795, కనిష్ఠ ధర రూ.600 చొప్పున పలికాయి. అలాగే అక్కడి నుంచి టమాటాలను శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, విజయవాడ జిల్లాలకు రవాణా చేశామని మార్కెటింగ్‌శాఖ అధికారులు తెలిపారు. రవాణా, కూలీల ఛార్జీలు కలిపి ఒక లారీ పంపాలంటే రూ.1.30 లక్షలు అవుతోందన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతుండటంతో.. టమాటా పంట దిగుబడి తగ్గుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. ఈ ప్రభావంతో ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందంటున్నారు.