గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జెట్టి హారిక అనే యువతి వెటర్నరీగా డాక్టర్‌గా పనిచేస్తూ ఉండేవారు. అయితే ఉన్నత చదువుల కోసమని ఏడాదిన్నర క్రితం హారిక అమెరికాకు వెళ్లారు. అయితే ఓక్లహోమా స్టేట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జెట్టి హారిక చనిపోయారు. ఈ విషయాన్ని అక్కడి సిబ్బంది హారిక కుటుంబసభ్యులకు చేరవేశారు. ఉన్నత చదవుల కోసం అమెరికాకు వెళ్లిన తమ కూతురు బాగా చదువుకుని తిరిగి వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న హారిక తల్లిదండ్రులు ఈ ఘటనతో శోకసంద్రంలో మునిగిపోయారు.
హారిక తండ్రి జెట్టి శ్రీనివాసరావు ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగి కాగా.. తల్లి నాగమణి గృహిణి. కుమార్తె చనిపోయిన విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించాలని, తమ కూతురు మృతదేహాన్ని భారత్‌కు త్వరగా వచ్చేలా చూడాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
మరోవైపు టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో జరిగిన మరో ప్రమాదంలో తెనాలికి చెందిన మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. తెనాలిలోని ఐతానగర్‌కు చెందిన రవితేజ అనే విద్యార్థి స్విమ్మింగ్ పూల్‌లో పడి ప్రాణాలు కోల్పోయారు.ఐతానగర్‌కు చెందిన తాడిబోయిన శ్రీనివాసరావు, జయలక్ష్మి పెద్ద కొడుకు రవితేజ.. ఎంఎస్ చేయాలని 2023 ఆగస్టులో అమెరికా వెళ్లారు. ఆస్టిన్‌లోని ఓ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నారు. అయితే జులై 18న ఆస్టిన్‌లోని ఓ స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లారు రవితేజ. తమిళనాడుకు చెందిన ఫ్రెండుతో కలిసి అక్కడకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తూ లోతు అధికంగా ఉన్న స్విమ్మింగ్ పూల్‌లోకి ఇద్దరూ జారిపడ్డారు. అయితే ఈ ఘటనలో తమిళనాడు యువకుడు బయటకు రాగా.. రవితేజ బయట పడలేక ప్రాణాలు కోల్పోయాడు. రవితేజ మరణవార్త విని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
రవితేజ నాన్న ఏడేళ్ల కిందటే చనిపోగా.. తల్లి జయలక్ష్మి వ్యవసాయ పనులు చేస్తూ కొడుకులను చదివించుకుంటూ వస్తున్నారు. పెద్ద కొడుకు రవితేజ ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లగా.. చిన్న కొడుకు అజయ్ తేజ చదువు పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే పెద్ద కొడుకు బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించుకుని వస్తాడని.. తమ జీవితాలు బాగుపడతాయని ఆశించిన ఆ తల్లి.. అనుకోని విధంగా కొడుకు చనిపోవటంతో గుండెలు పగిలేలా రోదిస్తోంది. ఈ ఘటన స్థానికులకు కూడా కలచివేస్తోంది. మృతదేహాన్ని త్వరగా భారతదేశానికి చేర్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.