ఏపీ సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం పార్టీ నేతలతో సమావేశమైన చంద్రబాబు పింఛన్ల పంపిణీపై టీడీపీ నేతలకు కీలక సూచనలు చేశారు. ఏపీలో ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయగా.. టీడీపీ కూటమి ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారులకు ఇంటివద్దనే పింఛన్లు పంపిణి చేసింది. జులైలో తొలిసారిగా పింఛన్లు పంపిణీ చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. ఒక్కరోజులోనే లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం తొలి రోజే 94 శాతం మందికి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ఆగస్టు నెల పింఛన్ల పంపిణీపై చంద్రబాబు దృష్టి సారించారు. అయితే ఆగస్ట్ నెల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక నేతలకు కూడా పింఛన్ల పంపిణీలో పాల్గొనాలని చంద్రబాబు స్పష్టం చేశారు.
మిగతా పనులు ఉన్నప్పటికీ ప్రతి నెలా ఒకటో తేదీన తమ నియోజకవర్గా్ల్లో జరిగే పింఛన్ పంపిణీ కార్యక్రమాల్లో విధిగా పాల్గొనాలని నేతలను చంద్రబాబు ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి సాకులు చెప్పొద్దని స్పష్టం చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉండేలా ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. అలాగే జిల్లాల్లో ఉన్న పార్టీ కార్యాలయాలను నెలలో ఒక్కసారైనా సందర్శించాలని.. కార్యకర్తల కష్టాలు తెలుసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు, విజ్ఞప్తులు స్వీకరించి.. వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని చంద్రబాబు సూచించారు.