ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ను ప్రశంసిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు ట్విట్ చేశారు. అన్నా లెజినోవా మాస్టర్స్ డిగ్రీ పొందిన సంగతి అందరికీ తెలిసిందే. సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి అన్నా లెజినోవా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్‌లో పట్టా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు అన్నా లెజినోవాకు అభినందనలు కూడా తెలిపారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పవన్ సతీమణి అన్నా లెజినోవాకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా చంద్రబాబు ట్వీట్ చేశారు. అన్న లెజినోవా సాధించిన ఘనత గొప్పదన్న చంద్రబాబు.. ఎంతో మంది సోదరీమణులకు ఆమె ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
" సింగపూర్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్ట్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసినందుకు అన్నా లెజినోవా గారికి అభినందనలు. మీరు సాధించిన ఘనత గొప్పది. కుటుంబపరమైన బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉన్నత చదువులు చదువుకోవాలనుకునే ఆంధ్రప్రదేశ్‌లోని సోదరీమణులు, యువతులకు మీరు స్ఫూర్తిగా నిలిచారు" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. మరోవైపు రష్యాకు చెందిన అన్నా లెజినోవా గతంలో మోడల్‌గా పనిచేశారు. సినిమాల్లోనూ నటించారు. ఇక తీస్‌మార్ అనే సినిమాలో అన్నా లెజినోవా- పవన్ కళ్యాణ్ కలిసి నటించారు. ఈ సందర్భంగా వీరి మధ్య ఏర్పడిన పరిచయం.. ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. 2013లో పవన్ కళ్యాణ్.. అన్నా లెజినోవాను వివాహం చేసుకోగా.. వీరికి మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కుమారుడు ఉన్నాడు. అంజనా పవనోవా కుమార్తె ఉంది. అయితే రష్యాకు చెందిన వారైనప్పటికీ అన్నా లెజినోవాకు భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలంటే ఎక్కువ ఇష్టం.
ఈ క్రమంలోనే బయట కూడా అన్నా లెజినోవా సంప్రదాయ చీరకట్టులోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఇక ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్‌తో కలిసి పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లడం, గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ నుదుటిన తిలకం దిద్దడం ద్వారా అన్నా అప్పట్లో వైరల్ అయ్యారు. అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనూ ఆ దృశ్యాలను వీడియో తీస్తూ అన్నా లెజినోవా సంతోషపడుతున్న దృశ్యాలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.