కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కోసం మూడు పథకాలు తీసుకువస్తామని పేర్కొంది. కొత్త ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించేందుకు మొదటి నెల జీతం ప్రభుత్వమే చెల్లిస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అదేవిధంగా కొత్త ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ చెల్లింపులలో మొదటి నాలుగేళ్లు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈమేరకు మంగళవారం లోక్ సభలో కేంద్ర హోంమంత్రి వరుసగా ఏడోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ లోని పలు కీలక అంశాలను ప్రస్తావిస్తూ సభలో ప్రసంగిస్తున్నారు.
‘మధ్యంతర బడ్జెట్‌లో పేర్కొన్నట్లుగా.. పేదలు, మహిళలు, యువత, రైతులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా దేశంలోని ప్రధాన పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాం. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన వల్ల 80 కోట్లమందికి ప్రయోజనం చేకూరింది. రాబోయే రోజుల్లో భారతదేశం ఆర్థిక వృద్ధిలో దూసుకుపోతుంది. ద్రవ్యోల్బణం స్థిరంగా 4 శాతం ఉంది. వచ్చే ఐదేళ్లలో 4.1 కోట్ల యువతకు ఉపాధి, నైపుణ్యం పెంపు కోసం రూ.2 లక్షల కోట్లతో ప్యాకేజీలను తీసుకురాబోతున్నాం. ఈ ఏడాది విద్య, ఉపాధి, నైపుణ్యం కోసం బడ్జెట్ లో రూ.1.48 లక్షల కోట్లు కేటాయించాం’ అని మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో వెల్లడించారు.