కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యం దక్కడంపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియ జేశారు. ఎక్స్ వేదికగా వరుస ట్వీట్లు చేసిన నారా లోకేష్..రాజధాని అమరావతి, జీవనాడి పోలవరం ప్రాజెక్టుల పూర్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించిన కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్ర బడ్జెట్లో రూ.15 వేల కోట్లు కేటాయించి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కట్టుబడిన ఎన్డీయే ప్రభుత్వానికి ఏపీ ప్రజల తరుఫున కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. ఏపీకి కొత్త సూర్యోదయం అంటూ మరో ట్వీట్ చేశారు నారా లోకేష్.
"ఆంధ్రప్రదేశ్‌కి కొత్త సూర్యోదయం. ఈరోజు బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనలకు నేను చాలా సంతోషిస్తున్నా, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సామాజిక లక్ష్యాలను సాధించడంలో ఇవి సహాయపడతాయి. మా పోరాటాన్ని గుర్తించి, పారిశ్రామికవృద్ధి, మౌలిక సదుపాయాలు, నీటిపారుదల, హెచ్‌ఆర్‌డి వంటి అన్ని ముఖ్యమైన రంగాలకు ప్రాధాన్యమిస్తూ.. ప్రత్యేక, సంపూర్ణ ప్యాకేజీ అందించడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా గర్వకారణం. అమరావతి, పోలవరానికి చేసిన ఉదార సహకారాన్ని నేను ప్రత్యేకంగా ప్రస్తావించాలనుకుంటున్నాను. కొత్త రాష్ట్ర చరిత్రలో ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. మన కలల సౌధాన్ని నిర్మించుకునే దిశగా ఇది మొదటి అడుగు" అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.
మరోవైపు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్‌లో ఏపీపై వరాల జల్లు కురిసింది. అమరావతి నిర్మాణానికి 15 వేలకోట్లు ప్రత్యేక సాయం చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామన్న కేంద్ర ఆర్థిక మంత్రి.. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలాగే హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం చేస్తామని తెలిపారు. హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు, విశాఖ - చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి నిధులు ఇస్తామని తెలిపారు.