తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్ బాధితులు ఎంతోమంది ప్రాణాలు తీసుకున్నారు. పమిడిముక్కల మండలం కృష్ణాపురంనకు చెందిన స్రవంతికి.. మంటాడకు చెందిన మేనత్త కొడుకు శ్రీకాంత్‌తో వివాహమైంది. అతడు తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నారు.. దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. స్రవంతి మొబైల్‌కు రూ.5 లక్షలు లోన్ ఇస్తామని ఓ మెసేజ్ వచ్చింది. కష్ట సమయంలో కుటుంబానికి ఈ డబ్బులు ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో ఆ నంబరును స్రవంతి సంప్రదించింది. రూ.5 లక్షలు లోన్ ఇవ్వాలంటే ముందుగా రూ.20వేలు, రూ.60వేలు.. వరుసగా రూ.80వేలు చెల్లించాలని చెప్పారు. ఆమె రూ. లక్ష అప్పు తెచ్చి మరీ చెల్లించింది.
మరో రూ.1.20 లక్షలు చెల్లిస్తే మొత్తం లోన్ ఇస్తామని స్రవంతి మొబైల్‌కు మెసేజ్ వచ్చింది. తాను ఇక డబ్బులు కట్టలేనని, మోసపోయానని అర్థమైంది.. ఈ విషయాన్ని భర్తకు చెప్పులేకపోయింది. ఆ బాధతో తాను తప్పు చేశానని భావించింది.. ఆమె ఓ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. బావా తప్పు చేశాను.. కుటుంబం కోసమే ఇలా చేశాను.. మొహం కూడా చూపించలేనని.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ఆదివారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేయగా.. కుటుంబ సభ్యుకలు గమనించి ఉయ్యూరు ఆస్పత్రికి తరలించారు.
స్రవంతిని మెరుగైన వైద్యం కోసం ఉయ్యూరు నుంచి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె అక్కడ చికిత్సపొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతి చెందింది. తన మరణానికి కారణం అంతా వివరిస్తూ ఆమె రికార్డు చేసిన వీడియో బయటకు రావడంతో ఈ లోన్ వ్యవహారం బయటపడింది. స్రవంతికి 6, 4 ఏళ్ల కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు గతంలో కూడా లోన్ యాప్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అయినా ఇప్పటికీ కొందరు అమాయకంగా మోసపోతున్నారు.