కేంద్ర బడ్జెట్ ఏపీపై వరాల జల్లు కురిపించింది.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు నిర్మల.. విభజన చట్టానికి అనుగుణంగా నిధుల్ని ప్రకటించారు. ఏపీ రాజధాని అవసరాలను గుర్తించి.. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు సాయం సర్దుబాటు చేస్తామన్నారు. వచ్చే సంవత్సరాల్లో అవసరాన్ని బట్టి అమరావతికి మరిన్ని అదనపు నిధులు అందిస్తామని చెప్పారు.
పోలవరం సత్వర నిర్మాణానికి సాయం అందిస్తామని.. ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం.. నీళ్లు, రోడ్లు, రైల్వేల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం అండగా ఉంటుందని.. అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలకు వెనుకబడిన ప్రాంతాల కింద నిధులు కేటాయిస్తామన్నారు. పూర్వోదయ పథకం ద్వారా బీహార్, ఆంధ్రప్రదేశ్, జార్ఘండ్, బెంగాల్, ఓరిస్సాలకు ప్రత్యేక ప్రాజెక్టులను ప్రకటించారు.
విశాఖ-చెన్నై, ఓర్వకల్లు- బెంగళూరు మధ్య ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రీ కారిడార్లకు నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. అవసరాన్ని బట్టి బహళ సంస్థల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు రుణాలిస్తామని స్పష్టం చేశారు. విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందిస్తామని ప్రకటించారు. విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం చేస్తామని కేంద్రమంత్రి తెలిపారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. విశాఖ - చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు ఇస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండుసార్లు ఢిల్లీకి వెళ్లారు. ఆ రెండుసార్లు కేంద్రమంత్రుల్ని కలిశారు.. ఏపీకి సాయం చేయాలని కోరారు. అలాగే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువ కేటాయింపులు ఉండేలా చూడాలని.. అమరావతి, పోలవరంకు నిధులు కేటాయించాలని రిక్వెస్ట్ చేశారు. కేంద్రం కూడా బడ్జెట్‌లో రాజధాని అమరావతికి ప్రాధాన్యం ఇచ్చింది.