కుప్పం నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ తన బిడ్డలాంటి వారేనని.. . వారి ఎదుగుదల కోసం ఎంతవరకైనా పోరాడతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి పేర్కొన్నారు. నారా భువనేశ్వరి మంగళవారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో.. చంద్రబాబును మరోసారి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు నారా భువనేశ్వరి కుప్పానికి వెళ్లారు. నాలుగు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటించనున్నారు. మరోవైపు గత ఎన్నికల సమయంలో చంద్రబాబుకు అత్యధిక మెజారిటీని ఇచ్చే గ్రామాన్ని దత్తత తీసుకుంటానని నారా భువనేశ్వరి అప్పట్లో ప్రకటించారు. ఆ ప్రకారమే గుడుపల్లి మండలం కమ్మగట్టుపల్లిని దత్తత తీసుకుంటున్నట్లు నారా భువనేశ్వరి మంగళవారం ప్రకటించారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో భువనేశ్వరి మాట్లాడారు. ఈ సందర్భంగా కుప్పంలో చంద్రబాబుని భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికీ భువనేశ్వరి ధన్యవాదాలు తెలియజేశారు. ఏపీలో జరిగిన అకృత్యాలకు, దౌర్జన్యాలను చూసి మహిళలు కసితో ఓటేసి టీడీపీని గెలిపించారన్నారు. అలాంటి మహిళల రుణం తీర్చుకోలేమన్న భువనేశ్వరి.. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా ప్రభుత్వం తరఫున ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇక కుప్పంలోని నిరుద్యోగ యువత ఉపాధి కోసం బయట ప్రాంతాలకు వెళ్లకుండా.. కుప్పంలోనే పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భువనేశ్వరి చెప్పుకొచ్చారు.
కుప్పం నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ తన బిడ్డలాంటి వారేనన్న నారా భువనేశ్వరి.. వారి ఎదుగుదల కోసం ఎంతవరకైనా పోరాడతానని అన్నారు. అలాగే కుప్పం నియోజకవర్గంలో తాను దత్తత తీసుకున్న రెండు ఊర్లతో పాటుగా అన్ని గ్రామాలను అభివృద్ధిచేసేలా పనిచేస్తామన్నారు. కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబుతోనైనా కొట్లాడతానంటూ నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కుప్పం నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటన నాలుగు రోజులు పాటు కొనసాగనుంది.
చంద్రబాబు స్కిల్ కేసులో జైలుకు వెళ్లిన సమయంలో జనంలోకి వచ్చారు నారా భువనేశ్వరి. నిజం గెలవాలి పేరిట రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేశారు. కార్యకర్తలతో మమేకం అవుతూ వారి బాధలు విన్నారు. ఇక ఎన్నికల సమయంలోనూ చంద్రబాబు తరుఫున కుప్పం నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. గెలిపించినందుకు ఇప్పుడు కృతజ్ఞతలు చెప్పేందుకు కుప్పానికి వెళ్లారు.