ఎన్నికల బరి నుంచి వైదొలగిన జో బైడెన్.. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు మద్దతు తెలపడంతో అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిత్వానికి పోటీ పడే అవకాశమున్న నేతల్లో కమలా ముందు వరుసలో ఉన్నారు. వచ్చే నెలలో జరిగే ఆ పార్టీ జాతీయ సమావేశంలో అధికారికంగా అభ్యర్థి ఖరారవుతారు. బైడెన్ సహా పలువురు సీనియర్ల మద్దతు తెలుపుతుడంతో ఎక్కువ అవకాశాలు ఆమేకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్‌పై భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ఎదురుదాడి మొదలుపెట్టారు. ట్రంప్ ఏంటో తనకు తెలుసన్న ఆమె.. నవంబరు ఎన్నికల్లో ఆయనను చిత్తుగా ఓడిస్తామని శపథం చేశారు.
డేలావేర్‌లోని విల్మింగ్టన్‌లో సోమవారం ఆమె పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా నవంబరులో గెలుపు మనదేనంటూ ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు. ట్రంప్‌ను ఓడించడానికి తాము సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు.. ‘ఆ వేటగాడు మహిళలను వేధిస్తాడు.. వినియోగదారులను కొల్లగొట్టిన కేటుగాడు.. స్వలాభం కోసం నిబంధనలను అతిక్రమించిన మోసగాడు... కాబట్టి డోనాల్డ్ ట్రంప్ ఎలాంటి వాడో నాకు తెలుసు చెబుతాను వినండి’ అని అన్నారు.
డొనాల్డ్ ట్రంప్ మన దేశాన్ని తిరిగి స్వాతంత్య్రానికి పూర్వం రోజుల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నారని కమలా మండిపడ్డారు. కానీ, అమెరికన్లందరికీ చోటు కల్పించే ఉజ్వల భవిష్యత్తును మేము విశ్వసిస్తున్నామని అన్నారు. రాజకీయంగా దుమారం రేపుతోన్న అబార్షన్ అంశంపై దృష్టి సారిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియపై రాజ్యాంగ హక్కును రద్దుచేస్తూ 2022లో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ ప్రశంసించడంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కావాల్సిన మద్దతు తనకు ఉందని ఆమె తెలిపారు. పార్టీ ప్రతినిధుల్లో సగానికి కంటే ఎక్కువ మంది తనవైపు ఉన్నారని ఆమె వెల్లడించారు.
అభ్యర్థి మాత్రమే మారుతున్నారని.. తమ లక్ష్యం మాత్రం ఒకటేనని ఆమె స్పష్టం చేశారు. పార్టీతో పాటు దేశం మొత్తాన్ని ఏకం చేసి ఈ ఎన్నికల్లో విజయం సాధిద్దామని కమలా హ్యారిస్ పిలుపునిచ్చారు. మరోవైపు, కమలా హ్యారిస్‌కు బైడెన్ మద్దతు ప్రకటించిన కొద్దిసేపటికే విరాళాలు వెల్లువెత్తాయి. కేవలం 24 గంటల్లోనే రికార్డుస్థాయిలో 81 మిలియన్ డాలర్లు పోగయ్యాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక్క రోజే ఇంత మొత్తం విరాళాలు రావడం ఇదే మొదటిసారని కమలా క్యాంపెయిన్ వెల్లడించింది. మొత్తం 888,000 మంది దాతల్లో 60 శాతం మంది మొదటిసారి విరాళం ఇచ్చివారే కావడం విశేషం. ఇక, మూడోసారి కరోనా వైరస్ బారినపడ్డ అధ్యక్షుడు జో బైడెన్.. క్రమంగా కోలుకుంటున్నారు. గతవారం లాస్ వేగాస్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయనకు కరోనా సోకడంతో అర్ధాంతరంగా సభను రద్దుచేసుకున్న విషయం తెలిసిందే.